నిజ జీవితంలో జర్నలిస్టులకు కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు హీరోయిన్లు. ఏవైనా పర్సనల్ విషయాలు అడుగారేమో, అఫైర్లూ గట్రా బయటకు లాగాలని చూస్తారేమోనని కాస్త భయం. అందుకే జర్నలిస్టులను తప్పించుకు పోవాలని చూస్తుంటారు. సినిమాల్లో మాత్రం అందరూ జర్నలిస్టులు అయిపోతున్నారు. ఎందుకో తెలీదు కానీ మన హీరోయిన్లకు జర్నలిస్టు పాత్రను పోషించడమంటే మహా ఇష్టం. కాస్త డ్యాషింగ్ గా, ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చేవిగా ఉంటాయని కాబోలు. గత కొంతకాలంగా చాలామంది హీరోయిన్లు జర్నలిస్టులైపోయారు. ఇప్పుడు కూడా కొందరు ఆ రోల్ ని చించేస్తామంటూ తయారయ్యారు. సెల్యూట్ సినిమాలో నయనతార జర్నలిస్టే. అయితే మరీ అంత సీరియస్ గా ఉండదు. ఇదే నయనతార కృష్ణం వందే జగద్దురుం చిత్రంలో సీరియస్ అండ్ సిన్సియర్ జర్నలిస్టుగా అదరగొట్టింది. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తమన్నా కూడా మీడియా పక్షే. వీళ్లలాగే ఇప్పుడు మరికొందరు హీరోయిన్లు జర్నలిస్టు పాత్రలో దూరిపోయారు. ఆరంభం చిత్రంలో తాప్సీది టీవీ జర్నలిస్టు పాత్ర. బిర్యానీ చిత్రంలో హన్సిక కూడా జర్నలిస్టుగానే నటిస్తోంది. చాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే చార్మి... ప్రతిఘటన సినిమాలో మీడియా ప్రతినిధిగా కనిపించనుంది. మహేశ్ బాబు నేనొక్కడినేలో హీరోయిన్ అయిన కృతి సనన్ కూడా జర్నలిస్టు పాత్రనే పోషిస్తోంది. చివరకు నవదీప్ సరసన నటిస్తోన్న కొత్త అమ్మాయి కావ్యశెట్టి కూడా ఇదే రోల్ లో అలరించనుంది. ఇలా హీరోయిన్లంతా జర్నలిస్టుగా మారిపోతున్నారు. ఎవరికి వారు ఆ పాత్రను తమ స్టయిల్లో పోషించెయ్యాలని తపన పడుతున్నారు. హిందీ హీరోయిన్లకు ఈ పాత్ర చేసే చాన్స్ అడపా దడపా వస్తూనే ఉంటుంది. పేజ్ త్రీ చిత్రంలో కొంకణాసేన్, నో ఒన్ కిల్డ్ జెస్సికాలో రాణీముఖర్జీ, సత్యాగ్రహలో కరీనా జర్నలిస్టులుగా ఇరగదీశారు. మరి మన ముద్దుగుమ్మలెలా పండిస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: