కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే నిర్మాతకు ఎంత బాధగా ఉంటుందో తెలియంది కాదు. అయితే కలలు కన్న ప్రాజెక్ట్ ఫెయిలైతే దర్శకుడికి కూడా అంతే బాధగా ఉంటుంది. అయితే నిర్మాత బాధతో పోలిస్తే నిర్మాత బాధే ఎక్కువ. ఆ విషయం సెల్వ రాఘవన్ కి బాగానే అర్థమయ్యింది.  వర్ణ సినిమా కోసం చాలా కలలు కన్నాడు సెల్వ రాఘవన్. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనుకున్నాడు. అది తనకు ఎంతో గొప్ప పేరు తెస్తుందని కూడా ఆశపడ్డాడు. అందుకే ఆ సినిమా తర్వాత రిటైర్ అయిపోవాలని కూడా డిసైడయ్యాడు. కానీ అతడి అంచాలన్నీ తారుమారు చేసింది వర్ణ. ఊహించనంత ఘోర పరాజయాన్ని చవిచూపింది. దాంతో షాక్ తిన్నాడు రాఘవన్. అయితే ఈ సినిమా కోసం అరవై కోట్లు ఖర్చు పెట్టిన పీవీపీ సంస్థ పరిస్థితి ఏమిటి? అదే ఆలోచించాడు సెల్వ. ఆ సంస్థవారితో మాట్టాడి జరిగిన నష్టానికి క్షమాపణ చెప్పాడని వినికిడి. అవకాశం ఇస్తే మరో సినిమా తీసి జరిగిన నష్టాన్ని పూడుస్తానని చెప్పాడట. అయితే ఇది గొప్ప విషయం కాదు. అతడిని నమ్మి మరో సినిమా తీయడానికి పీవీపీ సంస్థ రెడీ అవ్వడమే విశేషం.  త్వరలోనే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా తీసేందుకు పీవీపీ ఓకే చెప్పింది. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తాడట. విశేషమేమిటంటే... ఈ సినిమాకి సెల్వ రాఘవన్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. జరిగిన నష్టానికి పరిహారంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేస్తాడట. ఇలా ఆలోచించేవాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఎంత హర్ట్ అవ్వకపోతే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: