సినీరంగానికి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. వారికి ఉన్న గ్లామర్ తో జనం చేత ఓట్లు వేయించుకుని పదవులు చేపట్టడానికి సినిమా తారలు ఉబలాట పడుతూ ఉంటారు. ఇది కొత్త ఏమి కాకపోయినా ఎప్పటికప్పుడు కొత్తగా సినిమా సెలెబ్రెటీల రాజకీయ ప్రవేశం పై వార్తలు వస్తూనే ఉంటాయి. అటువంటి సందర్భమే మరల కొత్తగా వినపడుతోంది. రాబోతున్న ఎన్నికలలో మరికొందరు సినీ నటుల రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తం అవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా నటుడు విశాల్ కూడా రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తాన్ని చీపురుతో ఊడ్చిపారేసిన 'ఆమ్ ఆద్మీ పార్టీ'లో ఈ యువ నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ఆమ్ ఆద్మీ పార్టీ పగ్గాలు విశాల్ చేతికి రానున్నాయనే ప్రచారం కోలీవుడ్ లో హోరెత్తుతోంది. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే గళమెత్తినప్పుడు చాలామంది కోలీవుడ్ నటీనటులు ఆయనతో గొంతు కలిపారు, అలాంటివారిలో విశాల్ కూడా ఒకరు. అలాగే ఇటీవల విశాల్ నటీనటుల సంఘం వ్యవహారంలోను ప్రశ్నల వర్షం కురిపించి కలకలం పుట్టించాడు. ప్రస్తుతం తమిళనాడులోను ఈ పార్టీ ప్రాబల్యం పెరుగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో తాజా ప్రచారం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీలోకి విశాల్ ను ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమిళనాడులో పార్టీ అధ్యక్ష పదవిని కట్టుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై విశాల్ ఇంకా స్పందించలేదు. మరో ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ కూడా ఆప్ లో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అవినీతిని అంతం చేస్తామంటూ బరిలోకి దిగి అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇదే పార్టీలోకి గతంలో పవన్ ను ఆహ్వానిస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఎదిఎమైనా చీపురు టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులలో కూడా తన ప్రభావాన్ని చూపెట్టే అవకాసం ఉందని సినిమా రంగ విశ్లేషకులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: