నూతన సంవత్సరం వచ్చి ఐదురోజులు కాకుండానే తెలుగు సినిమాపరిశ్రమను మరో షాకింగ్ న్యూస్ కుదిపేసింది. ఒకనాటి టాలీవుడ్ చాక్లెట్ బాయ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త టాలీవుడ్ పరిశ్రమ ప్రముఖుల మైండ్ లను బ్లాంక్ చేసింది. అనుకోని ఈ పరిణామానికి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు, చిన్న హీరోలు తమ సంతాప, సందేశాలను ట్విటర్ ద్వారా తెలియచేయారు. హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మంచు మనోజ్, లక్ష్మీ మంచు, నాని, ఛార్మీ లాంటి ఎందరో టాలీవుడ్ ప్రముఖులు ఉదయ్ కిరణ్ మరణానికి సంతాపం తెలియచేస్తూ, తమ ట్విటర్ లో తెల్లవారకుండానే పోస్టింగ్ లు పెట్టారు. అదే విధంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, శివాజీ, శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్ రాజేష్ తో పాటు అనేకమంది ఉదయ్ కిరణ్ సన్నిహితులు అపోలో హాస్పటల్ కు చేరుకొని, అసలు జరిగిన విషయంపై ఆరా తీస్తున్నారు.  19 సినిమాలలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించాడు. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. నువ్వు నేను చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుని వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించిన రికార్డు ఉదయ్ కిరణ్ సొంతం.  చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో ఎంగేజ్ మెంట్ జరిగినా, కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. అక్కడనుంచే ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ఫాల్ ప్రారంభమైంది. అతరువాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడాడు ఉదయ్ కిరణ్. తరువాత అప్పుడప్పుడు సినిమాలలో హీరోగా నటిస్తూ మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా ఉదయ్ కిరణ్ కు అదృష్టం కలిసి రాలేదు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కారణాల పై రకరకాల కధనాలు వినిపిస్తున్నాయి  హీరోగా అవకాశాలు లేక నిరాశతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని కొందరు అంటూ ఉంటే మరికొందరు ఈ ఆత్మహత్యకు మరేదో కారణం అయిఉంటుంది అని అంటున్నారు. ఏమైనా ఒక మంచినటుడు చిన్న వయస్సులో ఇలా విషాదమరణం పొందడం దురదృష్టకరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: