అమీర్ ఖాన్ అనుకున్నది సాధించాడు. గత సంవత్సరం విడుదల అయిన సూపర్ హిట్ సినిమాల రికార్డులను తన ‘ధూమ్-3’ ద్వారా తిరగ రాస్తున్నాడు అమీర్. ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ చిత్రం ‘ధూమ్-3’ కలెక్షన్ల హవా కొనసాగుతోంది. డిసెంబర్ 20 తేదిన విడుదలైన ఈ చిత్రం విశ్వవ్యాప్తంగా 501.35 కోట్లు (83.56 మిలియన్ డాలర్లు) గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది అనే వార్తలు వస్తున్నాయి.  ధూమ్-3 చిత్రం భారతదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా వసూళ్ల చరిత్రను సృష్టిస్తోంది అని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ఈ చిత్రం మన భారత దేశంలో 351 కోట్ల గ్రాస్ వసూళ్లతో ముందుకు పోతోంది.  విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జర్మనీ, పెరూ, రొమెనియా, జపాన్, రష్యా, టర్కీ దేశాల్లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. బాలీవుడ్ లో గత సంవత్సరం విడుదలైన ‘హె జవానీ హై దివాని’ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’, ‘క్రిష్ -3’, కలెక్షన్స్ రేంజ్ ని దాటుకుని అమీర్ ఖాన్ సృష్టిస్తున్న కలెక్షన్స్ సునామి ఇండియన్ సినిమా మార్కెట్ స్థాయిని చాటుతోంది అనే వార్తలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.  మన టాలీవుడ్ 100 కోట్ల కలెక్షన్స్ కలను తీర్చే సినిమా ఈ సంవత్సరం అయిన వస్తుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: