‘ఉదయ్‌ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా జీవితం చూడండి ఎలా బుగ్గిపాలయ్యిందో’ అంటూ అతని భార్య విషిత కన్నీరుమున్నీరవుతోంది. ఉదయ్ సూసైడ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు అతని భార్య విషితను గురువారం సాయంత్రం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతసేపు తాను స్టార్ హీరోనన్న చట్రంలో ఉదయ్ కిరణ్ బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమవుతుండేవాడు. ఎన్నిసార్లు ఆయనకు స్వాంతన కలిగించినప్పటికీ లాభం లేకుండా పోయిందంటూ’ వాపోయింది.  సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం.. ఇవన్నీ ఉదయ్‌పై ప్రభావం చూపాయని వివరించింది. విలువైన స్థలాలు చాలానే వున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్...‘మనం చెన్నయ్‌కి వెళ్దాం. అక్కడ సినిమా అవకాశాల్లో ట్రై చేద్దామన్నాడు. అందుకే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం.  నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకుని..3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించాం’ కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపింది. విచారణలో తాను ఉదయ్‌ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని పలుమార్లు నెత్తి బాదుకుందని సమాచారం. కూతురి జీవితం సర్వనాశనమైందంటూ ఆమె తండ్రి కూడా పోలీసుల ముందు వాపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి: