హిందు సాంప్రదాయంలో ప్రతీ ఆచారం, సాంప్రదాయం, అధ్యాత్మికం వెనుక ఎన్నో అర్ధాలుఉన్నయి. తెలుగువారికి ఎన్నో పండుగలు ఉన్నా సంక్రాంతికే అగ్ర తాంబూలం. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్ళడం, కొత్త బట్టలు వేసుకోవడమే కాదు. ఈ పండుగ వెనుక అనేకమైన నిగూఢ అర్ధాలు ఉన్నాయి. మన పెద్దలు అనుసరించే సాంప్రదాయలనే కాదు మన తాత ముత్తాతలను గుర్తుకు చేసుకునే పండుగ. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి అందరూ సంక్రాంతి పండుగ గురించి ఎదురు చూస్తూ ఉంటారు.  పసిపిల్లలు భోగిపళ్ల కోసం, చిన్న పిల్లలు భోగిమంటలు గాలిపటాల కోసం పెద్దవారు ముఖ్యంగా స్త్రీలు కొత్తబట్టలు, నగలకోసం సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. పండుగలు అన్నీ మనుష్యుల మధ్య సామజిక భందాన్ని పెంచుకొనే వారధిగా ఉపయోగ పడతాయి. మన దగ్గర ఉన్న దాన్ని ఎదుటివారికి బహుమతుల రూపంగా ఇవ్వడం నేర్పిస్తాయి. అంతేకాదు ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తీసుకువస్తాయి.  సంక్రాంతి అంటేనే ముత్యాలముగ్గులు ఇవి ఆడవారికి ఓర్పును నేర్పే కళ, గొబ్బెమ్మలు అసహ్యం నుంచి ఉద్భవించిన అద్భుతం, కోడి పందేలు యుద్ద నీతిని గెలిపించే పందెం, భోగిమంటలు మనలోని వ్యామోహానికి నిప్పు, భోగిపళ్లు యోగిత్వానికి సంకేతం, గాలిపటం దారంలాంటిది జీవితం అనే చెప్పే వేదాంతం, గో పూజలు శ్రమకు కృతజ్ఞత ఇలా ఈ మూడు రోజుల పెద్ద పండుగాలోను మనం అనుసరించే ప్రతి పనికీ ఒక నిగూఢ అర్ధం దాగి ఉన్నది  సంక్రాంతిని మన రాష్ట్రంలోనే కాదు మన దక్షణ భారతదేశంలోని తమిళనాడు, కర్నాటకలతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా ఈ పండుగను జరుపు కుంటారు. సూర్యుని గమనం ఆధారంగా ప్రజలు ఆనందంతో జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాలలో వందలాది కోట్ల రూపాయలు కోడి పందాల రూపంగా ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారిపోతాయి. ఈ పందేలతో పోటీ పడుతూ మన తెలుగు సినిమా రంగంలో సంక్రాంతి సినిమాల పోటీకూడా ఉంటుంది. ఈ సినిమాలపై హీరో అభిమానులు కూడ భారీగానే పందాలు కడుతూనే ఉంటారు.  ఈసారి సంక్రాంతి విజేత ఎవరు అన్నదానిపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినా సంక్రాంతి హడావిడి తరువాత అసలైన విజేత ఎవరో తేలిపోతుంది. జనం సెల్ ఫోన్, ఇంటర్నెట్ ల మధ్య బంధింపబడి రోజులు గడిపేస్తూ ఉంటే అప్పుడప్పుడు జీవిత మాధుర్యాన్ని తెలియచేసే పండుగలు మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. కాలచక్రంలో నేడు ఉదయిస్తున్న మరో సంక్రాంతికి స్వాగతం.  

మరింత సమాచారం తెలుసుకోండి: