ప్రపంచంలో మరే దేశానికి లేని రెండు అరుదైన విశిష్టతలు భారత్ సొంతం. ఆరువేల సంవత్సరాల నాగరికతా వైభవం, అదేవిధంగా దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యువజన సంపద మన దేశానికి ఉన్న వరాలు. కాని అవినీతి, కుల, మత విద్వేషాలు భారతజాతి లో ఉన్నంత ఎక్కువగా మరే దేశంలోనూ లేని అరుదైన రికార్డు కూడ భారత్ సొంతం. నేటితరం ఆలోచనలను విపరీతంగా ప్రభావితం చేస్తున్న సినిమాలలో కూడ ఒకనాడు దేశభక్తి ప్రధానంగా ఉండేది.  ఒక నాటి మన తెలుగు సినిమాలలో కూడ దేశ భక్తికి సంబంధించిన సంభాషణలు పాటలు చాల విరివిగా ఉండేవి అనే విషయం సినిమాలను అభిమానించే ప్రతి వ్యక్తికి గుర్తుకు వచ్చే అంశం. జననీ జన్మ భూమిశ్చ అనే పాటతో ‘బొబ్బిలిపులి’ లో స్వర్గీయ ఎన్టీఆర్‌ యువతలో దేశభక్తిని చాటారు. అలాగే ‘సర్దార్‌ పాపారాయుడు’ లో కూడా తెల్లదొరలపై పోరాడే యోధునిగా నటించి అశేష జనాల నీరాజనాలు అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఎన్టీఆర్‌ మేజర్‌ చంద్రకాంత్‌ లాంటి దేశభక్తి సినిమాలో నటించారు . పుణ్యభూమి నాదేశం నమోనమామి అంటూ సుభాష్‌ చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు గెటప్‌లలో కనిపించి అందరిచేత జేజేలు అందుకున్నారు. పాడవోయి భారతీయుడా.. అంటూ ‘వెలుగు-నీడలు’ చిత్రంలో నాగేశ్వరరావు దేశభక్తిని చాటే గీతాన్ని అలపించారు. ‘పవిత్ర బంధం’లో గాంధీ పుట్టిన దేశమా అంటూ అక్కినేని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధులను గుర్తుకు తెచ్చారు. ‘జై జవాన్‌’ లాంటి దేశభక్తి చిత్రంలో రోల్‌ పోషించారు నటసామ్రాట్‌. నటశేఖర కృష్ణ తెలుగు వీర లేవరా అంటూ ‘అల్లూరి సీతారామరాజు’గా అభిమానులను అలరించారు. కమల్‌హాసన్‌ ‘భారతీయుడు’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు  అయితే ఇప్పుడున్న యంగ్‌ హీరోల్లో ఎవరూ దేశభక్తి ప్రధాన చిత్రాల్లో నటించడం లేదు. కేవలం కమర్షియల్‌ చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. కోట్ల రూపాయలలో పారితోషికాలు పెరిగి సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోవడంతో ప్రస్తుత నిర్మాతల దృష్టి అంతా ఖర్చు చేసిన కోట్ల రూపాయల పైనే ఉండటంతో మన దేశం గురించి, సంస్క్రుతి గురించి, దేశభక్తి గురించి ఆలోచించే ఓపికా, తీరికా మన నిర్మాతలకు యంగ్ హీరోలకు లేకపోవడంతో ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కామెడీ సీన్లున్న కమర్షియల్‌ చిత్రాల్లో నటించడానికే మొగ్గు చూపుతున్నారు. ట్విటర్, ఫేస్ బుక్, సెల్ ఫోన్స్ తప్ప మరో ప్రపంచం లేదు అనుకునే స్థితిలో నేటి యువతరం ఉంది. యువత ఆలోచనలను ప్రభావితం చేసే సినిమాలు తీసే రోజు ఎప్పుడో.  

మరింత సమాచారం తెలుసుకోండి: