‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన ఒక్క సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. పవన్ ‘గబ్బర్ సింగ్-2’ లో ఈమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అనే వార్తలు కూడ గత రెండు మూడు రోజులుగా ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈమె చిక్కుల్లో పడింది అంటు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో బుల్లెట్ కనిపించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారట. ఇది ఇండియాలో లభ్యంకాని 8 ఎంఎం బులెట్ ! ఈ బులెట్ నీ బ్యాగ్‌లోకి ఎలా వచ్చిందంటూ ఢిల్లీ పోలీసులు ఆమెని సుమారు నాలుగు గంటలసేపు ప్రశ్నలతో వేధించారట అయితే ఈ విషయం తనకు తెలియదని రకుల్‌ప్రీత్ సింగ్ ఎంత చెప్పినా వాళ్లు నమ్మలేదని అంటున్నారు. తన తండ్రి సైనికాధికారి కాబట్టి బహుశా రహస్యంగా దీనిని ఆయన తన బ్యాగ్‌లో పెట్టి ఉండవచ్చునని ఆమె అంటోంది. అయితే ఫోన్‌లో తన తండ్రితో మాట్లాడాక ఆయన అలాంటిపని చేయలేదని తెలిపింది. తాను ఇటీవల బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఎవరైనా ఈ బులెట్‌ను తన బ్యాగ్‌లో వదిలివేసి ఉండవచ్చునని కూడా రకుల్ చెపుతోంది. ఇంత హడావిడి జరిగిన తరువాత ఇది లైవ్ బులెట్ కాదని, డమ్మీ అని అధికారులు తేల్చారు. దీనితో రకుల్ ఊపిరి పీల్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వివాదాల నుంచి సులువుగా బయటకు వచ్చిన రకుల్ అదృష్టవంతురాలే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: