ఈరోజు ఉదయం అధికారికంగా ఎన్నిక‌ల ప్రకటన వెలువడింది. ఈ ఎన్నికలలో టాలీవుడ్ సెలెబ్రెటీలు చాలామంది ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఈ సారి ఎన్నికలలో కూడ అన్ని పార్టీల వారు సినిమా తారల గ్లామర్ తో ఓట్లు కొల్లగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ ఎన్నికల బరిలో గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌నే ప్రచారం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈయ‌న లోక్ స‌త్తా పార్టీ నుండీ ఎన్నికల రణ క్షేత్రంలో సిరివెన్నెల బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఈ మధ్యన లోక్ స‌త్తా కార్యవ‌ర్గ స‌మావేశాలు తిరుప‌తిలో తాజాగా జ‌రిగాయి. వాటికి సిరివెన్నెల కూడా హాజ‌ర‌య్యారు. అక్కడ పార్టీలో చేర‌డంపై ఆయ‌న ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సిరివెన్నెల కోరిన స్థానం ఇవ్వడానికి లోక్ స‌త్తా కూడా సిద్ధంగా ఉంద‌ట‌. మ‌రోవైపు ఈ గీత ర‌చ‌యిత ఎక్కడి నుంచి పోటీ చేయాలి? అస‌లు పోటీ చేస్తే విజ‌యావ‌కాశాలు ఉన్నాయా అనే విషయం పై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు లోక్ సత్తా సిద్దాంతాలను సిరివెన్నెల అభిమానిస్తారు కాని ప్రస్తుత రాజకీయ ఊబిలొ దిగే సాహసం సిరివెన్నెల చేయరు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. రచయితలు రాజకీయాలలో రాణించిన సందర్భాలు చాల అరుదు ఈ విషయం సిరివెన్నెలకు తెలియనిది కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: