ఇప్పటికే జవసత్వాలు పూర్తిగా పోయి మరణ శయ్యపై ఉన్న కాంగ్రెస్ ను బతికిద్దామని చిరంజీవి కోస్తా జిల్లాలలో చేస్తున్న వ్యాన్ యాత్రకు మెగా అభిమానుల నుండే వస్తున్న బహిరంగ ప్రశ్నలు చిరంజీవికి తల నొప్పిగా మారడంతో చిరంజీవి వివరణలు ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తన తమ్ముడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అవడాన్ని కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారు. ‘‘పవన్ లౌకికవాది. కానీ మతతత్వ బీజేపీని ఆయన కలవడం ఆశ్చర్యంగా ఉంది. పార్టీని పెట్టి పొత్తుల కోసం ఎవరు ఎవరినైనా కలవచ్చు. అది పవన్ ఇష్టం. కానీ గుజరాత్‌లోని గోధ్రా నరమేథంలో మోడీ పాత్రపై అభియోగాలున్నాయి. ఇవేవీ తెలియకుండా పవన్ కల్యాణ్ ఆయనతో చేతులు కలపడం చూస్తుంటే.. తమ్ముడికి అసలు ఆ అల్లర్ల విషయంపై అవగాహన ఉందా? అన్న అనుమానం కలుగుతుంది’’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.  అంతేకాదు మీడియాతో మాట్లాడుతూ ‘‘పీఆర్‌పీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ పదవులు కోరలేదు. చివరకు కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసినప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. నాతో మాట్లాడలేదు. అయినా మాది ఎప్పుడూ కలిసుండే కుటుంబం. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసి చూపడం మా దురదృష్టం’’ అని అన్నారు. చిరంజీవి తన ఉపన్యాసాలలో పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మెగా అభిమానులలో తీవ్ర అసహనానికి వేదికగా తూర్పుగోదావరి జిల్లా మారింది. ఈ జిల్లాలోని పిఠాపురంలో కాంగ్రెస్‌ బస్సు యాత్రలో చిరంజీవి పాల్గొన్నారు. ఇక్కడే, ఓ మెగా అభిమాని, పీఆర్పీ మాజీ కార్యకర్త.. చిరంజీవిపై మండిపడ్డారు. ‘పార్టీ పెట్టి, కాంగ్రెస్‌లో కలిపేసి మమ్మల్ని నట్టేట్లో ముంచేశారు కేంద్ర మంత్రి పదవి పొంది, రాష్ట్రాన్ని విడదీశారు..’ అంటూ చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశాడా అభిమాని. ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే అతని వెంట పలువురు అభిమానులు ‘శెబాష్‌..’ అంటూ ఎంకరేజ్‌ చేశారట. చిరంజీవికి ఈ ఘటనలో ఎలా స్పందించాలో అర్థంకాక అక్కడ నుంచి మౌనంగా ముందుకు వెళ్లి పోతు ఉంటే, ‘జై పవన్‌ కళ్యాణ్‌’ అంటూ అభిమానులు నినాదాలు చేశారట. ఇలాంటి పరిస్తుతులను చూస్తూ ఉంటే రాబోతున్న కాలంలో ఇంకా ఇటువంటి సంఘటనలు ఇంకెన్ని చూడాలో అనుకుంటున్నాడట చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: