బాలకృష్ణ అంటే… సంక్రాంతి హీరో. ప్రతి సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టడం బాలయ్యకే సాధ్యం. అయితే నటసింహం ట్రెండ్ మార్చాడు. సంక్రాంతికి బదులుగా ఉగాదిని ఎంచుకున్నాడు. మరి కొత్త సంవత్సరం బాలయ్యకు కలిసొస్తుందా?. ఆయనకు పోటీగా నిలిచే హీరోలు ఎవరు?.. ఉగాది అంటే… సినిమా ప్రియులు పండగ చేసుకుంటారు. ప్రతి ఏడాది తెలుగు వారి కొత్త సంవత్సరం బరిలో పెద్ద సినిమాలు ఉంటాయి. ఉగాది క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు హీరోలు పండగ సమయంలో రిలీజ్ డేట్లు ప్లాన్ చేస్తారు. అయితే టాలీవుడ్‌లో ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కటి మినహా పెద్ద సినిమాలేవీ ఉగాది బరిలో లేవు. ఈసారి ఉగాది బరిలో నిలిచిన ఏకైక సినిమా లెజెండ్. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం లెజెండ్‌ మూవీని ఈనెల 28న రిలీజ్ చేయబోతున్నారు. లెజెండ్ ట్రైలర్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. బాలకృష్ణకు సింహాతో సూపర్‌ హిట్ ఇచ్చిన బోయపాటి… దానికంటే డబుల్ ఎఫర్ట్ పెట్టి లెజెండ్‌ను తయారు చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఉగాది బరిలో సినిమాలు నిలిచినా చివరకు తప్పుకున్నాయి. మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రౌడీ మూవీ కూడా మార్చి 28 రోజే రిలీజ్ చేయాలని భావించినా… ఇప్పుడు పోస్ట్‌పోన్ చేశారు. రౌడీ సినిమాను వచ్చే నెల్లో విడుదల చేస్తామని మోహన్‌బాబు స్వయంగా ప్రకటించారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులు కలిసి నటించిన మనం సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఏఎన్నార్ చివరి సినిమా కావడంతో… మనం మూవీకి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాను ఉగాదికి రిలీజ్‌ చేయాలని భావించినా ఆతర్వాత వచ్చేనెలకు వాయిదావేశారు.. మొత్తానికి ఎలాంటి పోటీ లేకుండా లెజెండ్‌తో వస్తున్న బాలయ్య… మరో హిట్‌ కొడతాడన్న ఆశతో ఉన్నారు అభిమానులు. బాలయ్య ఉగాది సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: