కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబుని ‘రౌడీ’ గా చూపెట్టి తన పై వస్తున్న విమర్శలతో సంబంధం లేకుండా ఒక్క క్షణం కూడ ఆలస్యం చేయకుండా ఇక రాజశేఖర్ పై తన ద్రుష్టి పెట్టాడు వర్మ. ‘రౌడీ’ తీసిన చేత్తోనే యాంగ్రీ యంగ్‌మేన్ డా.రాజశేఖర్‌తో ‘పట్టపగలు’ అనే టైటిల్‌తో వర్మ ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. చాలాకాలం తరువాత రాజశేఖర్‌కి ఇలా బంపర్ ఆఫర్ దక్కింది. అతగాడు ఇంతవరకు ఇలాంటి పాత్రను చేయకపోవడం విశేషం అని అంటున్నారు. థ్రిల్లర్ సినిమాలను ఏకధాటిగా తీస్తున్న వర్మ విష్ణుతో ‘13’ అనే టైటిల్‌తో కూడా సినిమా తీస్తున్నాడు. ఇక ‘పట్టపగలు’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగానే శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ అయింది. తన కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు ఓ తండ్రి పడిన నరకయాతనను థీమ్‌గా తీసుకుని, దానికి హారర్ స్ర్కీన్‌ప్లే జోడించి వర్మ ఈ సినిమా తీశాడు అని టాక్. తండ్రిగా రాజశేఖర్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని అంటున్నారు. అయితే ఆయన కూతురిగా ఎవరు నటించారన్న విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు. మే నెల రెండోవారంలో ‘పట్టపగలు’ విడుదలయ్యే అవకాశం వుంది. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో ఎటువంటి అవకాశాలు లేక అయోమయంలో ఉన్న రాజశేఖర్ ను వర్మ ఎంత వరకు కాపాడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: