అనంతపురంజిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఈనెల 16న హీరో బాలకృష్ణ నామినేషన్ వేయనున్నాడు. నిన్న బావ చంద్రబాబు బాలయ్యకు బీ ఫారమ్ కూడ అందించాడు. ఇక హిందూపురంలో లెజెండ్ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నామినేషన్ తర్వాత బాలయ్య ప్రచారంలో నిమగ్నంకానున్నాడు. దీనితో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ వారి ఆనందం ఎంతసేపు నిలవలేదు. దీనికి కారణం బాలకృష్ణ రాజకీయ అరంగేట్రం ఖరారైన నేపధ్యంలో 'లెజెండ్' సినిమాని బ్యాన్ చేయాలని వైకాపా శ్రేణులు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది..సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'లెజెండ్' బాలయ్యకు అనుకూలంగా ఉందని, ఇందులో రాజకీయ అంశాలు మేళవించి వున్నాయని, బాలకృష్ణ లెక్కకు మించి రాజకీయ డైలాగ్స్ చెప్పాడని ఈ సినిమా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నది కావున వెంటనే బ్యాన్ చేయాలనీ, ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ సినిమాని రాష్ట్రమంతటా ప్రదర్శన నిలిపేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ ఇంకా నామినేషన్ వేయకుండా ఈ ఫిర్యాదుపై స్పందించలేము అని ఆయన ఎన్నికలలో పోటీకి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈ ఫిర్యాదుపై విచారణ చేస్తాం అని ఎన్నికల కమీషన్ వెల్లడించింది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నికల కమీషన్ నో అబ్జక్షన్ తీసుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిర్మాతలు భావిస్తున్నట్లు అంటున్నారు. కానీ ఎలక్షన్ కమీషన్ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన సమయానికి బాలకృష్ణ కేవలం టాలీవుడ్ హీరోగా మాత్రమే ఉన్నాడని ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలో దిగాడు కాబట్టి ‘లెజెండ్’ సినిమాను ఎన్నికలు అయ్యే వరకు ప్రదర్శనలు నిలిపి వేయాలని కోరుతున్న రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎలక్షన్ కమీషన్ ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: