ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, తన సినిమాలతో స్టార్‌ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన హీరో రాజశేఖర్‌. ఈయన గతంలో పలు సక్సెస్‌లు అందుకున్నప్పటికి ప్రస్తుతానికి ఈయన వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్నాడు. కెరీర్‌లో పలు ఒడుదుడుకులను ఎదుర్కొన్న రాజశేఖర్‌ గత కొన్ని సంవత్సరాలుగా పరాజయాలతోనే సహవాసం చేస్తూ వస్తున్నాడు. వరుస పరాజయాల వల్ల కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈయన మళ్లీ సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న రాజశేఖర్‌ కెరీర్‌ ఆ చిత్రాలపైనే ఆధారపడి ఉంది. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొడితే ఇక రాజశేఖర్‌ పని అంతే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయన నటిస్తున్న ఆ రెండు చిత్రాలు వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘పట్టపగలు’ మరియు రీమేక్‌ చిత్రం ‘గడ్డం గ్యాంగ్‌’. ఈ రెండు చిత్రాల్లో ‘పట్టపగలు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. కారణం ఆ చిత్రం వర్మది కావడమే. ఒక తండ్రి తన బిడ్డకు పట్టిన దెయ్యంను వదిలించేందుకు చేసిన ప్రయత్నాలే ఈ చిత్ర కథ. ఆసక్తికరంగా ఉన్న ఈ కథ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం ఖాయం అంటున్నారు. ఇక రెండవ చిత్రం ‘గడ్డెంగ్యాంగ్‌’. తమిళంలో సక్సెస్‌ అయిన ‘సూదుకవ్వమ్‌’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ ఒక కిడ్నాపర్‌ గ్యాంగ్‌కు హెడ్‌గా నటిస్తున్నాడు. తమిళంలో సక్సెస్‌ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు పి. సంతోష్‌ తీర్చి దిద్దుతాను అంటున్నాడు. ఈ చిత్రంను రాజశేఖర్‌ భార్య జీవిత నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రంలో సీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో మొదటగా ‘పట్టపగలు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయిన ఆ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఇక ‘గడ్డెం గ్యాంగ్‌’ చిత్రం శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆ చిత్ర యూనిట్‌ భావిస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించినంత మాత్రాన ఇక్కడ కూడా విజయం సాధిస్తాయి అంటే నమ్మకం లేదు. గతంలో రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘శేషు’ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. కాని తెలుగులో డిజాస్టర్‌గా మిగిలింది. ఈ రెండు చిత్రాలతో రాజశేఖర్‌ ఫామ్‌లోకి రాగలడా అంటే ఎక్కువ శాతం సినీ విశ్లేషకులు కష్టమే అని అంటున్నారు. కారణం ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. అందుకు తగ్గట్లు సినిమాలు తెరకెక్కిస్తేనే వారికి నచ్చుతాయి. అలా కాకుండా మూస తరహాలోనే సినిమాలు చేసుకుంటూ పోతే సక్సెస్‌లు అందడం కష్టం. ఈ రెండు చిత్రాల అనుభవం తర్వాత రాజశేఖర్‌ తన రూటును మార్చుకుంటాడు అని, ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసేందుకు సిద్దం అవ్వాలని, జగపతిబాబులాగా రాజశేఖర్‌ కూడా ఇక హీరో వేశాలు మానేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: