‘ఈరోజుల్లో’ అనే చిన్న చిత్రంను తీసి పెద్ద విజయం సాధించి, ప్రేక్షకుల దృష్టితో పాటు, సినీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించిన దర్శకుడు మారుతి. ఈయన తన మొదటి విజయం గాలి వాటం కాదు అని ఆ తర్వాత తెరకెక్కించిన ‘బస్టాప్‌’ చిత్రంతో నిరూపించాడు. ఈ రెండు చిత్రాలతో యూత్‌లో ఫుల్‌ క్రేజ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన ‘ప్రేమ కథాచిత్రమ్‌’తో ఈయన మరింతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. మెగా అల్లు ఫ్యామిలీతో ఈయనకు ఉన్న పరిచయాలతో తన సినిమాలకు ప్రమోషన్‌ చేసుకోవడంతో పాటు, మెగా హీరో అల్లు శిరీష్‌తో ఒక చిత్రం చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. అల్లు శిరీష్‌తో మారుతి తెరకెక్కించిన ‘కొత్త జంట’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పర్వాలేదు అనే టాక్‌ను తెచ్చుకుని పర్వాలేదు అనిపించే వసూళ్లను రాబటింది. ఇక ఈ చిత్రం తర్వాత మారుతి ‘రాధా’ చిత్రంకు దర్శకత్వం వహించాల్సి ఉంది. వెంకటేష్‌, నయనతార జంటగా దానయ్య నిర్మించాలనుకున్న ‘రాధా’ చిత్రంకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ చిత్రం కథ వివాదంలో చిక్కుకోవడంతో సినిమాను ప్రారంభించిన తర్వాత నిలిపివేయడం జరిగింది. ‘రాధా’ చిత్రం అనుకోక ముందు ఈయనతో పలువురు హీరోలు సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు యంగ్‌ హీరోలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ‘రాధా’ చిత్రం నిలిచిపోగానే మారుతి తన సమయం వృదా చేసుకోకూడదు అనుకుని నితిన్‌తో సినిమా చేయడాలని డిసైడ్‌ అయ్యాడు. అందుకు నితిన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. మారుతి చెప్పిన కథలో కొన్ని మార్పులను నితిన్‌ సూచించాడట. ఆ మార్పులకు మారుతి నో చెప్పాడు. అల్లు అర్జున్‌ ఓకే చెప్పిన కథను నితిన్‌ మార్పులు చెప్పడంతో మారుతి చేయను అని ఖరాఖండిగా చెప్పాడు. దాంతో నితిన్‌ తన తర్వాత చిత్రంను కరుణాకరన్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రంను నితిన్‌ నిర్మిస్తున్నాడు. నితిన్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో మారుతి అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్యను కలిశాడు. అయితే మొదట చైతూ కూడా మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్దంగా ఉన్నాను అని చెప్పాడు. కాని కొంత సమయం కావాలి అంటూ మెలిక పెట్టాడు. అయితే చైతూ అడిగిన కొంత సమయం నెల రెండు నెలలు కాదు. ఏకంగా ఆరు ఏడు నెలలు. దాంతో మారుతి అంత కాలం ఎదురు చూడటం తన వల్ల కాదు అని మరో హీరో కోసం వెదుకులాట మొదలు పెట్టాడు. అయితే మారుతికి సరైన హీరో తారసపడలేదు. ఈయనకు నచ్చిన హీరోలు తారసపడ్డా కూడా వారు ఈయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దంగా లేరు. హీరోల వెంట పడేకంటే కొత్త హీరోను ఎంపిక చేసుకుని, ఆ హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొత్త హీరో అయితే చెప్పినట్లు వింటాడు. ఆ హీరో సక్సెస్‌ అయితే ఆ పేరు తనకు వస్తుందని మారుతి భావిస్తున్నాడు. తను గతంలో చేసిన చిత్రాలు కొత్త వారితోనే కావడం, ఆ చిత్రాలు సక్సెస్‌ సాధించడంతో, మరోసారి కెరీర్‌ మొదట్లోలాగే మళ్లీ కొత్త వారితో సినిమా చేయాలని మారుతి భావిస్తున్నాడు. ఇలా మారుతి కెరీర్‌ మొదటికి వచ్చిందన్న మాట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: