కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలను ఏ నిర్మాత కూడా ల్యాబ్‌లకు పరిమితం చేయడు. సినిమా పూర్తి అయిన తర్వాత కిందా మీదా అయినా పడి ఆ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. సినిమాను బయ్యర్లు కొనకుంటే, తన సినిమా తనకు చేదా అని సొంతంగా అయినా విడుదలకు సిద్దం చేస్తాడు. కాని టాలీవుడ్‌లో ప్రస్తుతం మూడు చిత్రాలు మాత్రం నెలల తరబడి ల్యాక్‌కే పరిమితం అయ్యాయి. ఆ మూడు చిత్రాలు చిన్నా చితక హీరోలు, చిన్న బడ్జెట్‌ చిత్రాలు అనుకుంటే పొరపాటే. ఆ మూడిరటిలో మొదటి చిత్రం అక్కినేని నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఆటోనగర్‌ సూర్య’ చిత్రం. దేవ కట్టా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అనేక అవాంతరాల మధ్య, ఆర్థిక ఇబ్బందులతో ఈ చిత్రం షూటింగ్‌ ఎలాగోలా పూర్తి చేసుకుంది. ఆ మధ్య ఆడియో కూడా విడుదల అయ్యింది. కాని ఈ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఆ మధ్య ఈ చిత్రం విడుదల డేట్‌ను కూడా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. కాని మళ్లీ ఏం సమస్యలు వచ్చాయో కాని, ఆటో షెడ్‌కే పరిమితం అయ్యింది. ఇక రెండవ చిత్రం విషయంకు వస్తే ‘ఇంటింటా అన్నమయ్య’. ఈ చిత్రంను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత నిర్మాత యలమంచిలి సాయిబాబు, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నిర్మాత యలమంచిలి సాయిబాబు తనయుడు రేవంత్‌ హీరోగా నటించాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి అయి, విడుదల డేట్‌ను కూడా ప్రకటించారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని, నెలలు గడుస్తున్న ఈ చిత్రం ఊసే ఎత్తడం లేదు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయినా కూడా ఈ చిత్రంను విడుదల చేయడం లేదు. అసలు ఈ చిత్రం వస్తుందో లేదో అనేది కూడా అనుమానంగానే ఉంది. మూడవ చిత్రం విషయంకు వస్తే యంగ్‌ హీరో నితిన్‌ నటించిన ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’. ఈ చిత్రం ప్రారంభం అయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా విడుదలకు నోచుకోలేదు. నితిన్‌ ఈ చిత్రం తర్వాత అంగీకరించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని ఈ చిత్రంను ఇంకా త్వరలో త్వరలో అంటూ చిత్ర యూనిట్‌ నాన్చుతున్నారు. ఎందుకు ఈ చిత్రం లేట్‌ అవుతుంది అనేది మాత్రం తెలియరావడం లేదు. ఇలా ప్రముఖ హీరోల చిత్రాలు పూర్తి అయిన తర్వాత నెలల తరబడి ల్యాబ్‌లకే పరిమితం కావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కినేని ‘మనం’ విడుదల తర్వాత ఆటోను స్టార్ట్‌ చేస్తాం అని చిత్ర యూనిట్‌ చెబుతున్నప్పటికి అది నమ్మకం తక్కువే అని చెప్పాలి. ఈ మూడు చిత్రాలు కూడా అసలు విడుదల అవుతాయా లేక ల్యాబ్‌కే శాశ్వతంగా అంకితం అవుతాయా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: