భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గురువును భగవంతుడుగా శిష్యుడు ఆరాధించే పరంపర ఉంది. చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే వ్యక్తిగా మనం గురువుని ఆరాధిస్తాం. వేదాల సారాన్ని ఉపనిషత్తుల అర్ధాలను పూర్వకాలంలో గురువులు తమ శిష్యులకు భోధించి వారికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించే వారు. ప్రతి గురువులోను వేదవ్యాసుడి అంశ ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. అందుకే వ్యాసపూర్ణిమను మనం ‘గురుపూర్ణిమ’ గా జరుపుకుంటాం.  ఆది శంకరుడు నుండి నేటి ఆధునిక స్వామీజీల వరకు ఎందరో సద్గురువులు ప్రజల అజ్ఞానాన్ని తొలగించారు. అంతేకాదు ప్రజల మూఢత్వం, అజ్ఞానం తొలగించి మన హృదయాలను సువిశాలం చేయడానికి ఎందరో గురువులు మన జీవితాలను ప్రభావితం చేసారు. నిజమైన గురువు ఆడంబరాన్ని, పొగడ్తలను కోరుకోడు. నిరాడంబరమైన జీవితాన్ని కోరుకుంటాడు. ఒకటి లేకుండా వరుసగా వంద సున్నాలు పెట్టినా ప్రయోజనం ఉండదు అందుకే ఆ ఒకటికి అంత విలువ. మన జీవితాలలో కూడ గురువు అలాంటి వాడు. ఆయనే లేకపోతే మన జీవితం వృధా అన్న భావన నుంచి వచ్చినదే ‘గురుపూర్ణిమ’. గురుపూర్ణిమ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది షిర్డీ సాయినాధుని రూపం. బాబాకు అత్యంత ఇష్టమైన రోజులలో ‘గురుపూర్ణిమ’ ఒకటి. చిరిగిన బట్టలతో మన మధ్య సంచరించిన సాయిబాబా మేధావుల మధ్య మేధావిగా మసులుతూ వేదాంత రహస్యాలను ఎన్నో మనకు ప్రభోదించారు. బాబా ఏనాడు ఆడంబరమైన పూజలను, యజ్ఞయాగాదులను ప్రోత్సహించలేదు. సాయి బాబాకు కావలసింది శారీరిరక నియమాలు కాదు సాయి తన భక్తుల దగ్గర నుంచి కోరుకునేది మానసిక పవిత్రత. ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల ప్రజలకు పలికే దైవంగా వెలుగొందుతున్న సాయిబాబా పై కూడ కొందరు పీఠాధిపతులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడిడికి వెళ్ళిపోతున్నాం అని అనిపిస్తుంది.  ఇప్పటి స్వామీజీలులా వేల కొట్లలో ఆనాడు ఆస్తులు లేవు. ఆయనకు జీవించి ఉన్నంతకాలం ఆయనతో ఉన్నవి ఒక పొయ్యి, తిరగలి, ఒక కుండా, ఒక సంచి మాత్రమే. కానీ ఆయన ముఖంలో ‘కోటి వెలుగుల తేజస్సు’ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉండేది. అటువంటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని కూడ ఈరోజు కొందరు ఛాoధసులు విమర్శలతో టార్గెట్ చేయడం చూస్తూ ఉంటే సాయిబాబా లాంటి మహోన్నత వ్యక్తినే అర్ధం చేసుకోలేని నేటి సమాజం గురువును గౌరవించే స్థాయిలో ఉందా అని అనిపించక మానదు. పాలలో ఎన్ని పాలు గుమ్మరించినా తోడుకోదు చిటికెడు పెరుగు అవసరమే అదేవిధంగా మన జీవితానికి అర్ధం పరమార్ధం ప్రసాదించడానికి గురు సాంగత్యం లేనిదే జీవితం పరిపూర్ణం కాదు. ఎందరో మహానీయాల జీవితాలకు వెలుగు బాటలు ప్రసాదించిన గురుమూర్తులకు పాదాభివందనం. భారతీయ సంస్కృతి ఉన్నంతకాలం గురుపౌర్ణమి విశిష్టత అజరామరం... 

మరింత సమాచారం తెలుసుకోండి: