తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు బాపు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపు ఆదివారం చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. మూడేళ్ల కిందట తన ప్రాణస్నేహితుడు రమణ లోకాన్ని వదిలి వెళ్లాక మానసికంగా బాపు ఒంటరివాడయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా శ్రీరామరాజ్యం. బాపు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తమ సంతాపాన్ని తెలియజేశారు. బాపు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని వారన్నారు. సినీ నటులు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, దర్శకులు దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, నటీమణులు శారద తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు. సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ పేరు తో జీవితాన్ని ఆరంబించి సినీ రంగంలో బాపుగా స్థిరపడిన ఈ ప్రఖ్యాత వ్యక్తి అనేక కళాఖండాలను దృశ్యరూపంలో మలిచారు.ఎనభై ఏళ్ల వయసు కలిగిన బాపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.ముత్యాల ముగ్గు, శ్రీరామరాజ్యం, మిస్టర్ పెళ్లాం తదితర సినిమాలను తీశారు. ముళ్లపూడి వెంకట రమణ, బాపులు ఒక కాంబినేషన్ గా సినీ రంగంలో ఒక వెలుగు వెలిగారు.పద్మశ్రీ బిరుదాంకితుడైన బాపు బొమ్మలు వేయడంలో సిద్దహస్తుడు. బాపు దర్శకత్వ ప్రతిభకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం సినిమాలకు ఉత్తమ ప్రాంతీయ సినిమాలుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సీతా కళ్యాణం, వంశ వృక్షం సినిమలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ పురస్కారం బాపు అందుకున్నారు. బాలరాజు కథ, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామరాజ్యం సినిమాలకు బాపు దగ్గరకు నంది అవార్డులు నడిచివచ్చాయి. గతేడాది పద్మశ్రీ అవార్డును కేంద్రప్రభుత్వం బాపుకు అందజేసింది. రచయితగా, కార్టూనిస్టుగా, చిత్రకారునిగా, డిజైనర్‌గా విటన్నింటినీ మించి గొప్ప దర్శకుడిగా తెలుగువారికి సుపరిచితులు. 1945లో ఆంధ్రపత్రికలో కార్టూనిస్టుగా తన వెనె్నలను ప్రారంభించిన ఆయన దినదిన ప్రవర్థమానంగా శుక్లపక్ష చంద్రునిలా తెలుగుతెరపై దేదీప్యమానంగా వెలిగిపోయారు. బాపు అంటేనే అదో స్టయిల్. ఆయన కుంచ తెలుగింటి ఆడబడుచులా ఎన్ని వయ్యారాలు పోతుందో? ఆయన రూపొందించే ప్రతి సన్నివేశం ఎంత అందంగా ఉంటుందో? ఆయన చిత్రం చూసిన వారికే తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో కథకు సంబంధించిన అర్థాన్ని ముందుగానే తన చిత్రాలతో నటీనటులకు వివరించి చూపించేవారు. ఆ సన్నివేశంలో నటీనటులు ఎటువంటి భావాలను తమ ముఖాలపై ప్రదర్శించాలో బొమ్మల ద్వారానే స్క్రిప్ట్ గీసి వివరించేవారు. బాపు మరణం సినీ రంగానికి తీరని లోటు .బాపుకు ఎపిహెరాల్డ్.కామ్ సగర్వ నివాళులు తెలుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: