విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా తెలుగు సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని తాను జీవించినంతకాలం శాసించిన నందమూరి తారకరామారావు ఖ్యాతికి ఎన్ని అవార్డులు వచ్చినా ఆయన గొప్పతనం ముందు అవి చిన్నవిగానే మారిపోతాయి. ఆయన చనిపోయి 18 సంవత్సరాలు గడిచిపోయినా ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజల హృదయాలలో చిరంజీవి. లేటెస్ట్ గా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది.  ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ఎన్టీఅర్ పేరిట గూగుల్ ఈ గౌరవాన్ని అందించడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ తమ హర్షాన్ని తెలియచేస్తున్నారు.  వెండి తెర పై రాముడు, కృష్ణుడు పాత్రలకు జీవం పోసిన ఎన్టీఅర్ చనిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఆయనలా నటించి మెప్పించగల నటులు ఇప్పటికే కాదు భవిష్యత్ తరాలలో కూడా వస్తారు అన్న ఆశ కనిపించడంలేదు. రాజకీయపరంగా కూడా తెలుగు జాతి పౌరుషాన్ని దేశమంతా తెలిసేలా తెలియచేసిన ఆయన రాజకీయ చైతన్యం ఆయన వారసులు కొనసాగిస్తున్నా ప్రజలలో ఎన్టీఅర్ కు ఉన్నంత క్రేజ్ మరి ఏ రాజకీయ నాయకుడికి లేదు అన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఅర్ కు భారతరత్న పురస్కారం రావాలి అని కోరుకుంటున్న ఎందరో తెలుగు వారి ఆశలు ఎప్పుడు నెరవేరతాయో చెప్పలేకపోయినా గూగుల్ గుర్తించిన ఈ గుర్తింపు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: