భారతీయులలో చాలామంది రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కూడా చాలామంది ఒకరికి ఒకరు పరిచయం ఉన్నవారు ఎదురైతే రామ్ రామ్ అని అనుకుంటారు. ఈ అలవాటు ఎక్కువగా రాజస్థాన్,  గుజరాత్ రాష్ట్రాలలో చాల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాముడు పుట్టక ముందే రామనామ శబ్దం ఉంది అని అంటారు. కృతయుగంలోనే ఈ రామ శబ్దాన్ని జ్ఞానులు పరిచయం చేసారు అని అంటారు. ‘రామ’ అనే రెండు అక్షరాలలో ఆధ్యాత్మిక రీత్యా విశేషమైన అర్ధం ఉంది. 

మనదేశంలో చాలామంది రాముడుని అవతార పురుషుడిగా ఆరాధిస్తారు. అయితే ఆయన జీవితం నడిచిన తీరు అంతా విపత్తుల మయం. ఆయన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ తరువాత అరణ్యాల బాట పట్టి కష్టాలు పడ్డాడు. ఆ పై తన భార్య సీతాదేవిని అపహరించిన రావణాసురుడుతో భీకర సమరం చేసి సీతను పొందినా రాజ్యంలో ప్రజలు వేసిన నిందలు వల్ల తన భార్యను ఆ పై తన బిడ్డలను పోగొట్టుకుని జీవితంలో చాల భాగం ఏకాకిగా బ్రతికాడు. శ్రీరాముడు ఎదుర్కున్న అన్ని కష్టాలు మరెవ్వరూ అన్ని కష్టాలు పడలేరు అన్నది నిజం.  

ఎన్ని వ్యతిరేక పరిస్థుతులు ఎదురైనా శ్రీరాముడు ఎవరినీ నిందించలేదు. అంతేకాదు ఎంతో ఉదాత్తతతో హుందాగా నడుచుకుని మనిషి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో అన్న విషయానికి తన జీవితాన్ని ఒక  ఉదాహరణగా మార్చాడు కాబట్టే రాముడు  అవతార పురుషుడు అయ్యాడు. ప్రతి మనిషీ తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలుచుకోగాలిగితే ప్రతి వ్యక్తి అవతార పురుషుడే అన్న సత్యాన్ని  శ్రీరామ అవతారం తెలియ చేస్తుంది. రామ శబ్దంలో పవిత్రత ఉంది, శ్రీరామ శబ్దంలో ఏకాగ్రత ఉంది. వీటిని మించి ఈ శబ్దంలో  కర్తవ్య పరిపాలన ఉంది. అందువల్లనే యుగాలు గడిచిపోయినా అవతార పురుషుడిగా శ్రీరాముడుని ఇప్పటికీ ఆదర్శ పురుషుడిగా ఆరాదిస్తున్నాం.

ప్రతిమనిషి  తన జీవితాన్ని ఎలా సక్రమంగా నడుపుకోవాలో  ఆయన జీవితం మానవాళికి ఒక సందేశంగా ఉంటుంది. రాముడి పేరులో కన్నా రామ నామ శబ్దంలో గొప్ప శక్తి ఉంది.  అందువలనే రామాయణం  మానవేతిహాసం. జర్మనీలోని రామ్ బాగ్, ఇటలీ లోని రోమ్ పట్టణాల పేర్లకు మూలం రామ శబ్దమే అన్న పరిశోధనలు కూడా  ఉన్నాయి. ఇండోనేషియా, బాలి, జపాన్ వంటి దేశాలలో కూడా మన  రామాయణ కథలు ప్రాచూర్యం  పొందాయి అంటే విశ్వవ్యాప్త అవతార పురుషుడిగా శ్రీరాముడి  ఖ్యాతి ప్రపంచమంతా ఎలా వ్యాపించి ఉందో అర్ధం అవుతుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడి పోవడంతో శ్రీ సీతారామకళ్యాణం కూడా రెండు రాష్ట్రాలలోను వేరువేరు విధానాలతో భద్రాచలంలో మధ్యాహ్నం కడప జిల్లాలోని ఒంటిమిట్ట లో రాత్రి కళ్యాణం జరుగుతూ ఉండటంతో ఈసారి  తెలుగు ప్రజలు రెండు రకాలుగా జరగబోతున్న సీతారామకళ్యాణాన్ని చూడబోతున్నారు. ఆ కళ్యాణ రాముడు  ప్రజలందరిని ఆశీర్వదించాలని ఎపి హెరాల్డ్ కోరుకుంటోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: