ఈరోజు జరుగుతున్న ‘మా’ సంస్థ ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చిన నటి రోజా తాను ఓటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘మా’ సంస్థ ఎన్నికలలో జరిగిన రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ పెద్దలు అంతా ఒక చోట కూర్చుని ఎవరో ఒకర్ని అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే బాగుండేదని అంటూ ఎవరి వ్యక్తిగత ఎజెండాలను ‘మా’ సంస్థ ఎన్నికలలో తీసుకు రాకుండా ఉంటే బాగుండేదని కామెంట్ చేసింది రోజా. 

అయితే ఎవరో పెద్దలు తమ స్వార్థంతో దీనివెనుకాల ఉండి చిచ్చు పెట్టారని తన అభిప్రాయం అని అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మ్యానిఫెస్టో వచ్చిందని కామెంట్ చేస్తూ ఇప్పటివరకు చిన్నచిన్న నటులకు పెద్ద తారల వల్ల ఎటువంటి సాయం జరగలేదని భవిష్యత్తులో  ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నానని కామెంట్స్ చేసింది రోజా.

ఇప్పటి వరకు తెలుస్తున్న లేటెస్ట్ సమాచారం వరకు ‘మా’ సంస్థ ఎన్నికలలో నేటి తరం అగ్ర హీరోలలో ఒక్క బాలకృష్ణ తప్ప మరెవ్వరూ అగ్రహీరోలు ఓట్లు వేయడానికి రాకపోవడం ఆశ్చర్య కరంగా మారింది. మొత్తం మీద చూసుకుంటే ‘మా’ సంస్థకు దాదాపు 702 సభ్యత్వం ఉన్నా ఈరోజు పోలు అయిన ఓట్లు 400 లకు మించి పోలు అయ్యే అవకాశం లేదు అని అంటున్నారు.

అయితే పైకి ధైర్యం నటిస్తున్నా జయసుధ వర్గంలో, జరుగుతున్న పోలింగ్ తీరును బట్టి ధీమా సడలుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోటీ కాస్త గట్టిగానే వుందని ఇప్పుడు జయసుధ వర్గం అంగీకరిస్తున్నారు అని టాక్. ముఖ్యంగా జయసుధను ఏ పెద్దలైతే వెనుక నుండి సపోర్టు చేస్తున్నారో, ఆ పెద్దల పెత్తనంపై,  పైకి ఏమీ అనలేక మా సంస్థలో సభ్యత్వం ఉన్న చిన్న ఆర్టిస్టులు అంతా జయసుధ వర్గానికి ఓటు వేయకుండా రాజేంద్రప్రసాద్ ఓట్లు వేసి తమ అక్కసు తీర్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజేంద్రప్రసాద్ కు ఈ వ్యతిరేకత ఎంత వరకు కలిసి వస్తుందో ఫలితాలు  వస్తే  కాని చెప్పలేము అని అంటున్నారు విశ్లేషకులు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: