టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక వైపు తన రెండు  భాగాల  ‘బాహుబలి’ టెన్షన్ లో తల మునకలై రోజులు గడుపుతూ ఉంటే మరో వైపు నందమూరి సింహం బాలకృష్ణ నుండి వస్తున్న ఒత్తిడికి ఏమి సమాధానం చెప్పాలో  తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  

రాజమౌళికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఒక భారీ సినిమా తీసాక ఎటువంటి అంచనాలు లేని ఒక చిన్న సినిమాను తీస్తూ ఉండటం అతని అలవాటు. ‘మగధీర’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎటువంటి  అంచనాలు లేకుండా సునీల్ తో ‘మర్యాదరామన్న’ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా అదే అలవాటును కొనసాగిస్తూ రాజమౌళి తన ‘బాహుబలి’ రెండు  భాగాలు విడుదల అయ్యాక ఒక చిన్న సినిమా తీద్దామని ఆలోచిస్తున్నట్లు టాక్.

అయితే వచ్చే సంవత్సరం ‘బాహుబలి’ రెండవ భాగం విడుదల అయ్యాక వెనువెంటనే బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి దర్శకత్వ బాధ్యతలను చేపట్టవలసినదిగా బాలయ్య రాజమౌళి పై తన ఒత్తిడిని రకరకాల మార్గాల ద్వారా పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

అయితే ఈ విషయమై తప్పించుకుందామని రాజమౌళి ప్రయత్నిస్తున్నా అందుకు కుదరని విధంగా బాలయ్య రాజమౌళి పై పెంచుతున్న వ్యూహాత్మక ఒత్తిడి రాజమౌళిని గందరగోళంలో పడేస్తోంది అని టాక్. గతంలో జూనియర్ కు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ హీరోగా నిలబెట్టిన నేపధ్యంలో రాజమౌళి హస్తం నందమూరి కుటుంబానికి బాగా కలిసి వస్తుంది అన్న నమ్మకంతో బాలయ్య రాజమౌళి పై ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2016 లో రాజమౌళి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్న ఆసక్తి ఇప్పటి నుంచే ప్రారంభం అయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: