ప్రజాతీర్పును శిరసావహిస్తాం.. ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించుకుంటాం.. ఇదీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఓటమి చెందిన వారి నోటి నుంచి వచ్చే రొటీన్ డైలాగ్. మా ఎన్నికల ఫలితాల వేళా అదే రిపీటైంది. రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించాడు. 

రొటీన్ ఎన్నికల్లాగానే ఓడిపోయినవాళ్లు.. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత మేమంతా ఒక్కటేనంటూ ముక్తాయించారు. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం రొటీన్ గా రియాక్ట్ కాలేదు. చాలా ఎమోషనల్ అయిపోయారు. కుట్రలు చేశారు.. కుతంత్రాలు చేశారు. వెన్నుపోటు పొడిచారు. అయినా వాటని దీటుగా ఎదుర్కొన్నామన్నారు.  

మా అధ్యక్ష పదవికి పోటీపడిన తనను భయపెట్టారని, కుళ్లు రాజకీయాలు, కుట్రలు చేశారని మురళీమోహన్ వర్గంపై రాజేంద్ర ప్రసాద్ డైరెక్టుగానే నిప్పులు చెరిగారు. తనను అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారని, కానీ తాను నటకిరీటిని కాబట్టి అర్జునుడిలా విజయం సాధించానని ఆయన అన్నారు. తాము పంచపాండవుల్లా ఐదుగురిమే బరిలోకి దిగామని, వాళ్లు మాత్రం కౌరవుల్లా వచ్చారని ఎద్దేవా చేశారు. 

మేం ఒంటరిగా పోరాటం చేశాం.. ఇది ధర్మయుద్ధం. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్లలేడంటూ నా వెనకున్న ఏకైక వ్యక్తి.. నాగబాబు. రాజా.. ముందుకెళ్లు అన్నారని రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ గా మాట్లాడారు. రాజేంద్రప్రసాద్ ప్రెస్ మీట్ చూసినవాళ్లకు ఇక ముందు మా రాజకీయాలు రంజుగా సాగబోతున్నాయని అర్థమైపోయింది. 

గతంలో ఎప్పుడూలేని విధంగా.. సినీవర్గాల్లో విబేధాలు పొడచూపాయి. మా ఎన్నికలు ఎప్పటి నుంచో జరుగుతున్నా.. ఇంతలా పాపులర్ ఎప్పుడూ కాలేదు. అందుకు కారణం.. సినిమావాళ్లంతా భయంతోనో, భక్తితోనే ఒక్కమాటగా సాగిపోవడం. కానీ ఇప్పుడా సీన్ లేదు. 

మరి మా ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది.. మురళీమోహన్ ఆశించినట్టు.. ఫలితాలతోనే రాజకీయం ముగిసిపోతుందా.. అంతా ఒక్కటవుతారా.. అంటే.. అవునని చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. ఇంత జరిగాక.. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకోలేం. మరి ఏం జరుగుతుంది. రాజేంద్రప్రసాద్, ఆయన వెనక ఉన్న మెగా వర్గం.. కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారా.. ఎన్నికల సమయంలో విసురుకున్న సవాళ్లు మనసులో ఉంచుకుని అవకాశం వచ్చినప్పుడు సత్తా చూపుతారా..? ఏం జరుగుతుందో.. వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: