మా ఎన్నికల ఫలితాల్లో అనేక కోణాలు ఆసక్తిదాయకంగా మారాయి. జయసుధ ప్యానల్ లో ఉండి ఎన్నికలకు ముందు నానా హడావిడి చేసిన వాళ్లలో హేమ ఒకరు. మా ఎన్నికల పుణ్యమా అని హేమ చాలా కాంట్రావర్సీ అయ్యింది. సహజంగా కాస్త వ్యంగ్యంగా మాట్లాడే హేమ.. ఈ ఎన్నికల విషయానికి వచ్చేసరిగా బాగానే రెచ్చిపోయింది. 

ప్రత్యేకించి.. రాజేంద్రప్రసాద్ ప్యానల్లోని శివాజీరాజాతో ఆమె సవాళ్లు విసిరే రేంజ్ కు వెళ్లిపోయారు. శివాజీరాజా కూడా హేమను అనుకూడని మాటలు అనడంతో.. అది వారి వ్యక్తిగత యుద్ధానికి దారి తీసింది. ఒక దశలో.. తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేసిన శివాజీరాజాను దమ్ముంటే చర్చకు రావాలని కూడా సవాల్ చేసింది.

మా ఇంటి గొడవను శివాజీరాజా టీవీల కెక్కి తలవంపులు తెచ్చారని హేమ విమర్శించింది. నిలదీసింది. ఏ ఛానల్లోనైనా చర్చకు సిద్దమన్న హేమాంటీ.. అక్కడే తేల్చుకుందామని.. తనదే తప్పని రుజువైతే.. అక్కడే లైవ్ లో కాళ్లుపట్టుకుని క్షమాపణ చెబుతానని తెగేసి చెప్పింది. అంతేకాదు.. శివాజీ రాజా తన తల్లిదండ్రులను సరిగ్గా చూడటం లేదన్న సంగతినీ బయటపెట్టింది. 

ఇప్పుడు ఫలితాల్లో హేమ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా 252 ఓట్లతో గెలుపొందింది. అయితే తాను గెలిచినా హేమకు అంత తృప్తిగా లేదు.. తాను ప్రత్యర్థిగా భావించిన శివాజీరాజా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడమే అందుకు కారణమట. గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. శివాజీ రాజా కంటే హేమ చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర సంతోషం వెదుక్కోకతప్పదు కదా..! 


మరింత సమాచారం తెలుసుకోండి: