ఆగష్టు 7వ తారీఖున విడుదల కాబోతున్న ‘శ్రీమంతుడు’ సినిమాకు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడ ఒకేసారి విడుదల చేస్తూ ఉండటంతో ఆసినిమాకు అత్యంతభారీ కలెక్షన్స్ రాబట్టడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలను అన్వేషిస్తోంది ‘శ్రీమంతుడు’ యూనిట్. 

మహేష్ కెరియర్ లో మొట్టమొదటి సారిగా తన సొంత గొంతుతో తమిళoలో డబ్బింగ్ చెప్పి ‘శ్రీమంతుడు’ ను ‘సెల్వందన్’ పేరుతో భారీ స్థాయిలో కోలీవుడ్ లో కూడ ఆగష్టు 7వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఈసినిమా తమిళ వెర్షన్ ఆడియో రేపు చెన్నైలో జరిగే భారీ ఫంక్షన్ లో అత్యంత ఘనంగా విడుదల చేయబోతున్నారు. ఈవార్తలు ఇలా ఉండగా మహేష్ ‘శ్రీమంతుడు’ కు అనుకోని అదృష్టాన్ని కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ఇవ్వబోతున్నాడు. 

గత సంవత్సరం విడుదలైన ‘కత్తి’ సూపర్ హిట్ తో విజయ్ హవా ఇప్పుడు తమిళనాట రాజ్యమేలుతోంది. అత్యంత భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో విజయ్ హీరోగా నిర్మించిన ‘పులి’ ఆడియో వేడుక ఆగష్టు 2న చెన్నైలోని ఒక ప్రముఖ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరగబోతోంది. వేలాది సంఖ్యలో విజయ్ అభిమానులు పాల్గొనబోతున్న ఈ ఆడియో వేడుకకు మహేష్ ను అతిధిగా ఆహ్వానించడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

మహేష్ ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ‘సెల్వందన్’ విడుదలకు కేవలం 5రోజుల ముందు జరగబోతున్న భారీ ఫంక్షన్ ‘పులి’ ఆడియో వేడుక కావడంతో మహేష్ అడగకుండానే అతడు నటించిన ‘సెల్వందన్’ కు అనుకోని అదృష్టంగా మారింది అని అంటున్నారు. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమా ఆడియోకి యూత్ లో వచ్చిన క్రేజ్ తో పాటు తమిళనాట విజయ్ అభిమానుల సపోర్ట్ కూడ కలిసి వస్తే ‘శ్రీమంతుడు’ నిజంగానే 70 కోట్ల సినిమాగా మారినా ఆశ్చర్య పడనక్కరలేదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: