పొగడ్తలంటే పడిపోని వారు ఎవరుంటారు? చివరికి, 'మీరు పొగడ్తలకు పడే రకం కాదుసార్‌' అనే పొగడ్తకైనా గ్యారంటీగా పడిపోతారు. కానీ తెలుగులో ఇప్పుడిప్పుడే మంచిమంచి అవకాశాల్ని చేజిక్కించుకుంటున్న హీరోయిన్‌ రెజీనా మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతోంది. పొగడ్తలంటే తన కిట్టదు అని చెప్పడం లేదు గానీ.. అలా పొగిడితే మాత్రం నాకు మహా చిరాకు, కోపం వచ్చేస్తుంది అని సీక్రెట్‌ చెబుతోంది. ఇంతకూ ఆమెకు అంతగా కోపం తెప్పించే ఆ పొగడ్త ఏంటా అనుకుంటున్నారు కదా.. ''రెజీనా పక్కింటి అమ్మాయిలా ఉంటుంది'' అని ఎవరైనా కితాబివ్వడమే!! 


నిజానికి తెలుగు హీరోయిన్లకు సంబంధించినంత వరకు ఇది చాలా గొప్ప పొగడ్త కింద లెక్క. 'హీరోయిన్‌ పక్కింటి అమ్మాయిలా ఉంది' అంటే గనుక.. ఆ అమ్మాయి చేతిలో పుష్కలంగా అవకాశాలు కలిగి ఉండగల అర్హతలతో తెలుగుదనం మూర్తీభవించినట్లున్న అమ్మాయి అనే లెక్కలో అందరూ తీసుకుంటారు. 'అమ్మాయి బాపు బొమ్మలా ఉంది' అనే పొగడ్త ఎలాగో ఇదికూడా అంతే! అయితే.. ఆ పొగడ్త మాత్రం ఆమెకు ఇష్టం లేదుట. ఇటీవలి కాలంలో రెజీనా పక్కింటి అమ్మాయి ముద్రను చెరిపేసుకోవడానికి చాలా హాట్‌ గ్లామర్‌ డాల్‌ గెటప్‌లోకి మారుతూ.. ఆ ఫోటోలను తన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లలో తనే ప్రమోట్‌ చేసుకుంటోంది. 


ఈ పక్కింటి అమ్మాయి అనే ట్యాగ్‌లైన్‌ వల్ల తనకు అన్నీ మూసపాత్రలే దక్కుతున్నాయని.. దీనివల్ల కెరీర్‌ లో వైవిధ్యాన్ని నష్టపోవాల్సి వస్తోందని ఆమె అంటోంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో ఈ అమ్మాయి గ్లామర్‌ పాత్రలు చేయడానికి పనికిరాదు అని చాలా మంది కామెంట్‌ చేసేవాళ్లు. వాళ్ల అభిప్రాయం తప్పు అని నేను నిరూపించదలచుకున్నా అని కూడా రెజీనా పంతంగా చెబుతోంది. పక్కింటి అమ్మాయి ముద్రనుంచి గ్లామర్‌ డాల్‌ గా మారడం అనేది తనకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నదని రెజీనా మురిసిపోతోంది. ప్రస్తుతం సాయిధరం తేజ్‌తో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ చేస్తున్న ఆమె తర్వాత గోపీచంద్‌, మంచు మనోజ్‌తోను చిత్రాలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత మంచు విష్ణుతో నాలుగో సినిమా కూడా ఉన్నదిట. ఇలా వరుస అవకాశాలు చాలా హేపీగా ఉన్నాయంటోంది. 


రెజీనా పక్కింటి అమ్మాయిలా ఉంటే ఏంటి, హాట్‌ బేబ్‌ లాగా ఉంటే ఏంటి.. సక్సెస్‌లు సాధిస్తున్నంత వరకు, మంచి సినిమాల్లో నటిస్తున్నంత వరకు ఆమె కెరీర్‌గ్రాఫ్‌ బాగున్నట్లే కదా అనుకుంటున్నారు అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: