బాహుబలిలో భల్లాలదేవుడు గుర్తున్నాడు కదా.. మరచిపోవడం కష్టం. పాత్రకు చాలా మంచి పేరే వచ్చినప్పటికీ.. అది విలన్‌ పాత్రే. సదరు భల్లాలదేవుడు సంకుచితమైన రాజద్రోహి మాత్రమే. అందుకే అతనిప్పుడు తనలోని 'లీడర్‌' క్వాలిటీస్‌ను నిరూపించుకునే ప్రయత్నంలో పడ్డాడు. అవును 'లీడర్‌' టీం మళ్లీ జట్టుకట్టబోతోంది. దగ్గుబాటి రానా మొదటి సినిమాగా వచ్చిన 'లీడర్‌'కు సీక్వెల్‌ తయారవుతోంది. తొలిచిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్‌ కమ్ముల దీన్ని కూడా రూపొందించనున్నారు. 


దగ్గుబాటి రానా.. స్టార్‌ హీరోలుగా వెలగాలనుకునే సినీ కుటుంబానికి నవతరం ప్రతినిధి. అయితే తొలిసినిమా 'లీడర్‌'కు విమర్శకుల ప్రశంసలు దక్కినా.. కమర్షియల్‌గా అతి కష్టమ్మీద సక్సెస్‌ అనిపించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయోగాలు చేశాడు. తెలుగులో.. సక్సెస్‌ గ్రాఫ్‌ ఎరిగిన పలువురు దర్శకులతో పనిచేసినా.. తనకంటూ గుర్తుండిపోయే సక్సెస్‌ మాత్రం దక్కలేదు. ఇలాంటి నేపథ్యంలో బాహుబలి విజయం దగ్గుబాటి రానాకు అపురూపమైనదని చెప్పాలి. దీని ద్వారా లభించిన క్రేజ్‌ కూడా తక్కువేమీ కాదు. రెండు రాష్ట్రాల్లో హీరో ప్రభాస్‌కు సమానంగా రానాకు కూడా అభిమానులు కటౌట్లు పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంత క్రేజ్‌ వచ్చినా.. ఆ సినిమాలో అతను చేసింది విలన్‌ పాత్రే. గొప్ప విలన్‌ అని మాత్రమే ఎవరైనా అంటారు. అందుకే వెంటనే తనకు పాజిటివ్‌ ఇమేజి పెంచే.. భారీ హీరో చిత్రం చేయాలనే ఉత్సాహంతో రానా ఉన్నట్లుగా తెలుస్తోంది. 


మొత్తానికి ఆయన మళ్లీ లీడర్‌ సినిమా రూపకర్త శేఖర్‌ కమ్ములతో టీమ్‌అప్‌ అయ్యారు. లీడర్‌ 2 చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రానా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించి శేఖర్‌ కమ్ముల ఇప్పటికే రానాను కలిసి ఒక ప్లాట్‌ లైన్‌ను వినిపించడమూ.. రానా దానికి ఓకే చెప్పేయడమూ కూడా జరిగిపోయిందిట. లీడర్‌ సినిమాలాగానే దాని సీక్వెల్‌ కూడా.. ప్రధానంగా రాజకీయాల్లో ఉండే అవినీతి మీదనే కాన్సంట్రేట్‌ చేస్తుందని అంటున్నారు. 


అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రయత్నాలు ఇంకా చాలా తొలి దశలోనే ఉన్నాయి. కథలైన్‌ మాత్రమే రెడీ అయింది. శేఖర్‌ కమ్ముల స్క్రిప్టు మొత్తం సిద్ధం చేయాల్సి ఉంది. స్క్రిప్టు వర్కుకు కమ్ముల చాలా ఎక్కువ సమయం తీసుకుంటారన్నది అందరికీ తెలిసిన సంగతే. రానా వెల్లడించిన వివరాలను బట్టి.. 'లీడర్‌ 2' ప్రాజెక్టు ఖరారైనట్లే గానీ.. ఎప్పటికి పట్టాలెక్కుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. 


మరింత సమాచారం తెలుసుకోండి: