బాలీవుడ్‌లో తనకంటూ విపరీతమైన క్రేజ్‌ కలిగి ఉన్న గాయకుల్లో అద్నాన్‌ సమీ ఒకరు. యువతరంలో ఆయన పాటలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అలాంటి అద్నాన్‌ సమీ.. స్వతహాగా పాకిస్తానీ. అక్కడినుంచి వచ్చి బాలీవుడ్‌లో గాయకుడిగా స్థిరపడ్డాడు. కాకపోతే.. ఆయన ఎప్పటికప్పుడు తన వీసా గడువు తీరినప్పుడెల్లా పొడిగించుకుంటూ.. భారత్‌లోనే ఉంటున్నారు. తాజాగా ఆయనకు ప్రభుత్వం ఎంతకాలమైనా భారత్‌లోనే ఉండేందుకు అనుమతి ఇచ్చేసింది. 


విదేశాలకు చెందిన కొందరు సెలబ్రిటీలకు ఆయా దేశాల్లో ఇబ్బందులు ఉన్న సమయంలో.. మన దేశంలో తలదాచకోవడానికి భారత్‌ అనుమతి ఇస్తూనే వస్తోంది. గతంలో రచయిత్రి తస్లీమా నస్రీన్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. ముస్లిం మత పెద్దలు ఆమె తలకు వెల నిర్ణయించడంతో ప్రాణభయంతో తస్లీమా భారత్‌కు వచ్చేసింది. ఇక్కడే ఆశ్రయం పొందుతూ ఉంటోంది. అద్నాన్‌ సమీ.. పాకిస్తాన్‌లో తనకు ప్రమాదం లేకపోయినప్పటికీ.. బాలీవుడ్‌లో అవకాశాల రీత్యా.. ఇక్కడకు వచ్చేశాడు. అయితే ప్రతిసారీ.. తన వీసా పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజాగా మే 26వ తేదీతో వీసా గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం అయితే.. గడువు ముగిసిపోయిన తర్వాత ఆయన తిరిగి పాకిస్తాన్‌ వెళ్లిపోవాలి. అయితే ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. మానవతా దృక్పథంతో తనను భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని కోరారు. 


కేంద్రం ఆయన విజ్ఞప్తి పట్ల చాలా సానుకూలంగా స్పందించింది. మళ్లీ మళ్లీ వీసా పొడిగింపుల అవసరం కూడా రాకుండా.. ఆయన ఇష్టమొచ్చినంత కాలం భారత్‌లోనే ఉండేందుకు అనుమతి ఇచ్చేసింది. దీంతో అద్నాన్‌ సమీ గానానికి అబిమానులకు పండగే అనుకోవాలి. ఆయన గానమాధుర్యం.. బాలీవుడ్‌ సంగీత ప్రియులకు ఇక ఎప్పటికీ అందుబాటులో ఉంటుందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: