తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి చిత్రం ఇప్పుడు కొత్త విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అనేక విషయాల్లో, అనేక రికార్డులు సృష్టించిన ఈ చిత్రం మరికొన్ని కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఎన్నిరోజులు గడుస్తున్నా... ఇంకా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటూనే ఉంది.

ఐతే.. ఈ సినిమాను రికార్డుల కోసం ప్రేక్షకులు రాకపోయినా థియేటర్లలో కొనసాగిస్తున్నారన్న విమర్సలు వస్తున్నాయి. ఎక్కువ రోజులు ప్రదర్శించిన చిత్రం రికార్డు కోసం బలవంతంగా ఈ సినిమాను ఆడిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు బాహుబలి దర్శకుడు రాజమౌళి దృష్టికి వచ్చాయి. 

దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. తమ సినిమా రికార్డుల కోసం ప్రయత్నించడం లేదని... అలాంటి ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. కావాలనే థియేటర్లను బ్లాక్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. సినిమాకు ఆడియెన్స్ తగ్గిన వెంటనే సినిమా నిలిపేస్తామని స్పష్టం చేశారు. ఎక్కువ రోజులు ఆడే రికార్డులకు కాలం చెల్లిందని.. అలాంటి తప్పుడు రికార్డులు తమకు అవసరం లేదని తెలిపారు.

ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం ఇతరుల సినిమాలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని కూడా రాజమౌళి కామెంట్ చేశారు. పనిలో పనిగా ఈ సినిమాను ఇంత బ్రహ్మాండంగా ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు జక్కన్న. 



మరింత సమాచారం తెలుసుకోండి: