తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి..ఎంతో మంది జీవితాలకు ఆధారం చూపిన  ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు (81) కన్నుమూశారు. సాయంత్ర ఐదు గంటలకు నగరంలోని ఓ స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు.  తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న జన్మించారు.

ఆయనకు భార్య జయలక్ష్మి, కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.  డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. నిర్మాత యు.విశ్వేశ్వరరావు అనువందించిన 'పార్వతీకల్యాణం' చిత్రంలో శివుడి పాత్రధారికి ఆయన తొలిసారిగా డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ నటించిన 'ఆత్మబంధువు' చిత్రంతో తెర వెనుక నుండి తెరపైకి వచ్చారు.


1960 – 1974 మధ్య కాలంలో దాదాపు 30 చిత్రాల్లో గుర్తింపు కలిగిన వేషాలు వేశారు. వందకు పైగా చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. కానీ ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తరువాత అదృష్టం కలిసి వచ్చింది. 'శ్రీ వెంకటేశ్వర కల్యాణం' పేరుతో విడుదలైన ఆ అనువాద చిత్రం రెట్టింపు లాభాలు తెచ్చి పెట్టింది. 1976లో విడుదలైన 'సిరిసిరిమువ్వ' విజయం సాధించింది. అనంతరం పూర్ణోదయ ఆర్ట్ పిక్చర్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం 'తాయారమ్మ – బంగారయ్య' చిత్రాన్ని నిర్మించారు. ఇక అప్పటి నుండి నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు జైత్రయాత్ర మొదలైంది.


ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాలు


పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. ఆపద్భాంధవుడు, స్వరకల్పన, స్వయం కృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, సాగర సంగమం, సితార, సీతాకోక చిలుక, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర సినిమాలను నిర్మించారు. ఆయన అసలు పేరు ఏడిద నాగేశ్వరరావునాయుడు. ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు చిత్ర ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ టోలీచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరుగనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: