నిన్న విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటున్న ‘రుద్రమదేవి’ చిరంజీవిని ఊహించని విధంగా కార్నర్ చేయడం చిరంజీవికి అనుకోని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ పెరిగి పోతున్న భారీ సినిమాల బడ్జెట్ పైన ఆ భారీ సినిమాల మధ్య ఇరుక్కుపోతున్న చిన్న సినిమాల పైన జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సినిమా రంగ నిర్మాతలు ‘రుద్రమదేవి’ సినిమాను చిరంజీవి పెద్ద మనసుతో ఆదుకోవాలని అభ్యర్ధించడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

‘రుద్రమదేవి’ లాంటి మంచి సినిమాలు బ్రతికి బయటపడాలి అంటే కనీసం రెండు వారాలు ఆ సినిమాకు టైమ్ ఉండాలని అయితే కేవలం 7 రోజుల గ్యాప్ తో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ అక్టోబర్ 16న విడుదల అవుతూ ఉండటంతో ‘రుద్రమదేవి’ కి మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా నిలదోక్కుకోలేదని అందువల్ల ‘బ్రూస్ లీ’ సినిమాను అక్టోబర్ 16న కాకుండా మరో వారం చిరంజీవి పూనుకుని వాయిదా వేయిస్తే చిరంజీవి పెద్ద మనసుకు నిదర్శనంగాగా మారి గుణశేఖర్ కు మేలు జరుగుతుందని ఆ చర్చలో పాల్గొన్న కొందరు సూచించారు.

అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు  తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా చిరంజీవి అయిన నేపధ్యంలో ఈ మాత్రం సహాయం చిరంజీవి ‘రుద్రమదేవి’ కి చేసి మంచి సినిమాలను ప్రోత్సహించాలని అదే చర్చా గోష్టిలో పాల్గొన్న వ్యక్తులు కోరడం మరొక ట్విస్ట్. ఈ వార్తలు ఇలా ఉండగా నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ చిరంజీవికి నమస్కరిస్తూ ‘రుద్రమదేవి’ ని బతికిoచమని వ్రాసిన బహిరంగ లేఖ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

‘బాహుబలి’ విడుదల సమయంలో ఆ సినిమా కలెక్షన్స్ కు ఎటువంటి అడ్డు లేకుండా తన ‘శ్రీమంతుడు’ సినిమాను నాలుగు వారాల పాటు వాయిదా వేసుకున్న మహేష్ బాబుకు ఉన్నంత పెద్ద మనసు, సంస్కారం చిరంజీవికి కూడ ఉంటే ‘రుద్రమదేవి’ బతికి బయట పడుతుంది అని నిర్మాత రామసత్యనారాయణ ఈ బహిరంగ లేఖలో చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న మెగా కుటుంబ సినిమాలకు పండుగలతో సంబంధం లేదని ఆ సినిమాలు ఎప్పుడూ విడుదల అయితే అప్పుడే పండుగ అని నిన్నటి చర్చా గోష్టిలో పాల్గొన్న కొందరు నిర్మాతలు చేసిన సూచనలు చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ విడుదల విషయంలో పాటించి తన పెద్ద మనసును చాటుకుంటాడా అన్నదే ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: