తెలంగాణలో నుంచి గత కొంత కాలంగా బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడుతున్న అభాగ్యుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకు వస్తుంది.   తెలంగాణ ఏర్పడి తర్వాత ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో  తెలంగాణ ఎన్నారైల కోసం ప్రత్యేక పాలసీ(విధానం) తీసుకురానుంది. ఈ పాలసీని రూపొందించే దిశగా ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రాష్ట్ర ఐటీ, ఎన్నారై శాఖ మంత్రి కెటి రామారావు చర్యలు ప్రారంభించారు. ఈ పాలసీని ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి ప్రయోజనం కలిగేలా రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతే కాదు  కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నారై పాలసీలను ఆయన స్వయంగా పరిశీలించారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పాలసీ ఉండబోతోంది.

ఇప్పటికే అధికారులతో చర్చలు నిర్వహించిన మంత్రి కేటీఆర్ వచ్చే వారంలో ఎన్నారై సంఘాలతో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల కోసం పనిచేస్తున్న సంస్థలతో సమావేశం నిర్వహించనున్నారు.విదేశాలకు వెళ్లే యువత మోసాలకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవడంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలోనే విదేశాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురైనవారికి, మరణించినవారికి అందాల్సిన సహాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి వారినుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించనున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత పాలసీని తీసుకువచ్చే విధంగా మంత్రి కెటిఆర్ కసరత్తు చేస్తున్నారు.  ఇలాంటి కొత్త పథం తెలంగాణలో అమలైతే ఎంతో మంది నిరుద్యోగులకు బంగారు భవిష్యత్ చూపించినట్లు అవుతుందని పలువురు ప్రశంసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: