మన భారత్ సంప్రదాయం ప్రకారం ఒక గొప్ప వ్యక్తి అంటే ఎవరు డబ్బు సంపాదించినవాడా...? లేక సంపాదించిన డబ్బుతో పది మందికి సహాయపడేవాడా...? అంటే టక్కున వచ్చే సమాధానం ఆపద సమయంలో పది మందికీ సహాయపడేవాడే అసలైన సామాజిక విలువలున్న మనిషి అని. మరి ఇలా అందరు కోటీశ్వరులు చేస్తున్నారా...? అంటే ఎవరో ఒకరు ఎపుడో అపుడు ఇలాంటివి చేస్తూ ఉంటారనే విషయం కూడా మనకు విదితమే. పెంచిన తల్లిని , పెరిగిన ఊరును మరిచినవాడు మన సాంప్రదాయాల దృష్టిలో వాడు ఎంత సంపాదించిన దండగే అని మనం ఎన్నో పురాణాల్లో మనం చదివే ఉంటాం.



సొంత ఊరిలో పెరిగి ప్రాథమిక విధ్యాభ్యాసం అక్కడ చదివినా సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఉన్నత విద్య అభ్యసించి విదేశాల్లో స్థిరపడ్డా ఊరికోసం కొంతైనా సహాయం చేయాలనే తపనతో కొందరు మహానుభావులు ముందుకు వస్తున్నారు. ఇలాంటి చర్యలకు పూనుకోవాలనే ఆలోచన రావడం వాటిని కార్యరూపం దాల్చేలా కృషి చేయడం నిజంగా అభినందించదగ్గదే. సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతాడు ఒక మహానుభావుడు. కన్నతల్లి రుణం కొంత తీర్చాలని, పుట్టిన వూరికి ఎంతో కొంత సేవ చేయాలని తన సంపాదనలో కొంత ఖర్చుచేస్తు మన్ననలు పొందుతున్నారు. 



ఒక లక్ష ఉన్నవారు రెండు లక్షలు సంపాదించాలని, కోటి ఉన్నవారు రెండు కోట్లు కావాలని కోరుకుంటున్న ఈ రోజుల్లో తనదైన శైలిలో తన గ్రామం కోసం గుడి, బడి నిర్మించడమే కాకుండా అందుకు తగిన భూమిని సైతం విరాళంగా ఇచ్చారు. పాఠశాల విద్యను అభ్యసించాలంటే పక్కనున్న గ్రామానికి వెళ్లాల్సిన ఇబ్బందిలేకుండా చేశారు. అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తు ఏడాదికి ఒకసారి సొంత గ్రామాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి ఇక్కడి పేదలకు సాయం చేస్తున్న ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన రాజనర్సింగరావు.



జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన రాజనర్సింగరావు అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నారు. ఏడాదికి ఒకసారి సొంతగ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడి పేదలకు బట్టలు పంపిణీ చేయడం, అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. గ్రామంలో ఉన్నత పాఠశాల లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు పక్కనున్న తాళ్లపేట గ్రామానికి వెళుతున్న విషయం తెలుసుకుని అందుకు ఒక ఎకరం భూమిని విరాళంగా ఇవ్వడమే కాకుండా పాటశాల భవనాన్ని సైతం నిర్మించి ఇచ్చారు. 



అలాగే గ్రామ సమీపంలో సుమారు ఐదెకరాల భూమిని గుడి కోసం విరాళంగా ఇచ్చారు. వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించి మాన్యంలో 4 ఎకరాల మామిడితోటను నాటించారు. ఈ తోట ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికే చెందేలా తీర్మాణం చేశారు. దీంతో రాంపూర్‌ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్న నేనున్నానని ధైర్యాన్నిచ్చేందుకు ప్రవాసభారతీయుడు పాలెపు రాజనర్సింగరావు ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఆయన తమ్ముడు పాలెపు ప్రసాదరావు నివాసం ఉంటున్నారు. ఇక్కడి సమస్యలును అన్నయ్య దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో తగిన చొరవతీసుకుంటున్నారు. అన్నదమ్ముల సేవలను గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: