మాట సహాయం గొప్పదా..? చేత సహాయం గొప్పదా..? అని ప్రశ్నించుకుంటే టక్కున వచ్చే సమాధానం విస్పష్టం. మాటల సహాయం అయితే అందరూ చేస్తారు కానీ చేత సహాయాన్ని మాత్రం కొందరే చేస్తారు. కృష్ణజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తిన వెంకటగణేశ్వరరావు, వెంకటవీరమ్మ దంపతుల కుమారుడు బత్తిన నాగార్జున. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 



పేదరికాన్ని జయించాలన్న సంకల్పంతో పట్టుదలతో ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకుంటూ... 2010లో యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న కరుణామయి మదర్‌థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారాయన. చిన్నవయసులోనే యూఎస్‌లో ఉద్యోగం సంపాదించి పుట్టిన వూరికి... చుట్టుపక్కల గ్రామాలకు తన వంతు సేవలను అందిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.



పేదరికాన్ని జయించే వజ్రాయుధం విద్య. అలాంటి విద్యను పేదవారికి అందించడమే నాధ్యేయం. ముందుగా స్వగ్రామంలోని పేద విద్యార్థులకు అన్ని విధాలుగా చేయూతనివ్వడం క్రమేపి ఈ సేవలను మండల, నియోజకవర్గం స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. స్నేహితులు, బంధువుల సహకారంతో యూఎస్‌లో ఉంటూనే సేవలను అందిస్తున్నాను. ‘మానవసేవ డాట్‌ ఆర్గ్‌(ఓఆర్‌జీ)’ అనే వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాను. నా శక్తి మేరకు విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు ఎన్నారై నాగార్జున.



స్వగ్రామమైన గొల్లగూడెంలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్తకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి నాగార్జున ముందుకు వచ్చారు. అప్పటికీ అధికారులు భవన నిర్మాణం చేపట్టడానికి ఆలస్యం చేయడం... ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రమాదకరంగా ఉండటంతో విద్యార్థుల శ్రేయస్సు కోసం భవన నిర్మాణానికి తానే చర్యలు తీసుకున్నారు. దాదాపు రూ.6 లక్షల వ్యయంతో ‘అక్షరాలయ’ పేరుతో కొత్త భవనాన్ని నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 29వ తేదిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి అక్టోబర్‌ 5న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు స్వాధీనం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: