ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికలో చివరాఖరుకు వైకాపానే విజేత అయ్యింది! వాస్తవంగా బలం ఆ పార్టీనే సంపాదించుకొన్నా.. తెలుగుదేశం మాత్రం చాలా గేమ్స్ ప్లే చేసి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పరిస్థితిని మొత్తం తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించింది. అయితే వెన్నుపోటుకే పోటు.. అన్నట్టుగా ఈదర హరిబాబు వైకాపా మద్దతుతో, తెలుగుదేశం వాళ్లలో కొందరిని చీల్చుకొని జడ్పీ చైర్మన్ అయ్యాడు. స్వతంత్ర అభ్యర్థి గా సత్తా చాటుకొన్నాడు. ఆ హరిబాబును తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇప్పుడు తమ పార్టీకి దెబ్బ పడిందని ఒప్పుకోవడం! ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రలోభాల ద్వారా నెగ్గడాన్ని వ్యూహాత్మకం, చాతుర్యం అని అంటున్న మీడియా... ప్రకాశం జిల్లా లో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని, వైకాపా ఊహించని దెబ్బ కొట్టిందంటూ... టీడీపీ అనుకూల టీవీ చానళ్లు కూడా వ్యాఖ్యానించాయి. ఇక ఈ సీటులో సరికొత్త గేమ్ ప్లాన్ అమల్లో పెట్టడంపై వైకాపా అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. ఇది కుక్కకాటుకు చెప్పుదెబ్బలాంటిదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నిజాలను ఒప్పుకోలేకపోతున్నాడని, అందుకే అక్రమ పద్ధతుల్లో జడ్పీ చైర్మన్ పదవులను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడని, ఆయన ఆలోచన తీరుకు తగిన దెబ్బ తగిలిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకనైనా బుద్ధిగా ఉండాలని, నెల్లూరు జడ్పీ చైర్మన్ విషయంలో నీతిగా వ్యవహరించాలని అంటున్నారు. ఇక నెల్లూరు పరిస్థితిని చూస్తే.. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేంత వరకూ కూడా ఎన్నిక వాయిదా పడుతూనే ఉంటుందేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: