ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తామని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం దళిత ద్రోహానికి పాల్పడుతూ వారి హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలు 32 శాతం ఉంటే.. కేవలం రెండు మంత్రి పదవులతో సరిపెట్టారని మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కత్తి పద్మారావు మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత మహాసభ తీర్మానాలను ఆయన మీడియాకు తెలిపారు. వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన రూ.16 వేల కోట్ల రూపాయలు కాజేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బి.ఆర్.అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఏపీ రాజధానిలో నిర్మించాలని తీర్మానించామన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 1న నూతన రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి పార్టీని సిద్ధం చేస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: