సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు అనేకం... అని తేల్చి చెప్పారు ఆ పార్టీ నేతలు చాలా మంది. ఇక ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన తెలంగాణలోనూ పార్టీ ఓడిపోవడానికి కారణం... పొన్నాల లక్ష్మయ్య వంటి పీసీసీ అధ్యక్షుడే కారణమని మండిపడ్డ నాయకులూ ఉన్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ కూడా చేశారు సీనియర్ నేతలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు. తెలంగాణ సెంటిమెంట్ కు తోడు, ఒక్కసారి కేసీఆర్ కు అవకాశం ఇచ్చి చూద్దామన్న ఓటరు ఆలోచనా... వెరసి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘన విజయం కట్టబెట్టాయి. సరే ఓటరు తీర్పు అలా రాసి ఉంటే... తమ నాయకులు మాత్రం ఏం చేస్తారులే అని సరిపుచ్చుకున్నారు మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ సార్వత్రిక సమరం కంటే ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచిన చోట్ల కూడా జడ్పీ పీఠాలను దక్కించుకోలేక పోవడంలో మాత్రం రాష్ట్ర పార్టీ పెద్దలు వైఫల్యాన్ని ఒప్పుకోక తప్పదు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా వరంగల్ తో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల జడ్పీ ఛైర్మన్ పదవులను టీఆర్ఎస్ ఎగరేసుకు పోతుంటే కాంగ్రెస్ కళ్లప్పగించి చూసింది తప్ప... చేసిందేం లేదన్న విమర్శ సొంత పార్టీలోనే బలంగా వ్యక్తమవుతోంది. ఈ మూడు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. వరంగల్ జిల్లా పరిషత్ పీఠం కోసం 26 మంది మద్దతు అవసరం ఉండగా... కాంగ్రెస్ 24 స్థానాల్లో గెలిచింది. అయినా 18 సీట్లు మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సీటును రాజకీయ చాతుర్యంతో అవలీలగా తన్నుకుపోయింది. మహబూబ్ నగర్ లోనూ 28 మంది జడ్పీటీసీలను గెలిపించుకున్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి 25 సీట్లలో గెలిచిన టీఆర్ఎస్ జడ్పీ సీటులో కూర్చుంది. ఇక తాజాగా జరిగిన రంగారెడ్డి జడ్పీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ కాంగ్రెస్ ను మరోసారి దెబ్బ కొట్టింది. కాంగ్రెస్ జడ్పీటీసీలను తమ వైపుకు తిప్పుకుని మరీ జడ్పీ పీఠాన్ని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు జిల్లాల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకున్నా... రాష్ట్ర నాయకత్వం ప్రణాళికా లోపం వల్లనే ఒక్కచోట కూడా జడ్పీ పీఠాలను దక్కించుకోలేక పోయామన్న చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం జడ్పీలు మాత్రమే కాదు... మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను అనేక చోట్ల టీఆర్ఎస్ కుదేలు చేసింది. ఓటరు తీర్పిచ్చిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాగూ వెనకబడినా... అదే ఓటరు మెజారిటీ సీట్లు గెలిపించిన చోట కూడా పీఠాలను దక్కించుకోలేక చతికిల పడడానికి కారకులు ఎవరు అన్నదే కాంగ్రెస్ కార్యకర్తలను తొలుస్తున్న ప్రశ్న. ఇప్పటివరకూ ఇంకెవ్వరూ బహిరంగంగా చెప్పకపోయినా అందరూ టార్గెట్ చేస్తున్నది పొన్నాల లక్ష్మయ్యనే అనేది బహిరంగ రహస్యమే. మరి ఈ ఎన్నికల ఫలితాల పైన అయినా పొన్నాల స్పందిస్తారో... లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: