మొత్తం మీద రుణమాఫీపై మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం సర్కారు.. లక్షన్నర వరకూ మాఫీ చేయాలని డిసైడ్ చేసింది. రాజకీయంగా వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఎంతభారమైన తట్టుకోవాల్సిందేనని నిర్ణయించారు. ఆ సంగతి చంద్రబాబు క్లియర్ గా ప్రకటించేశారు. మొత్తం మీద ఈ రుణ మాఫీ విలువ 30 వేల కోట్ల రూపాయలని కూడా తేల్చేశారు. మరి ముందే ఆంధ్ర సర్కారు లోటు బడ్జెట్లో ఉంది. ఆర్ బీ ఐ రీషెడ్యూలింగ్ కు అవకాశం కల్పించినా.. ఇంత మొత్తం భరించడం ఆంధ్ర సర్కారుకు అంత తేలికైన పని కాదు. రుణమాఫీ నిధుల సమీకరణ కోసం చంద్రబాబు సర్కారు కొత్త ప్లాన్ వేసింది. అదే తాగుబోతుల నుంచి సొమ్ము సేకరించడం.. అంటే డైరెక్టుగా కాదులెండి.. ఇన్ డైరెక్టుగా అన్నమాట. లిక్కర్ అమ్మకాలపై వచ్చే ఆదాయంలో కొంత శాతం సెస్ కింద పక్కకు పెట్టి ఆ సొమ్ములను రుణమాఫీ నిధుల కింద జమ చేస్తారట. ఇప్పటికే అది ఏ రాష్ట్రమైనా ఆదాయంలో సింహ భాగం లిక్కర్ అమ్మకాల నుంచే వస్తోంది. ఒకప్పుడు మద్యపాన నిషేధం వంటి ఉదాత్తమైన హామీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. హామీలివ్వడమే కాదు.. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ తర్వాత పగ్గాలు అందుకున్న చంద్రబాబు.. ఆ హామీకి తిలోదకాలు ఇచ్చేసి మద్యాన్ని సర్కారును నడిపే ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారు. లిక్కర్ అమ్మకాలు రోజురోజుకూ పెరగడమే కాక తగ్గడం లేదు. అంటే ఢోకా లేని ఆదాయమన్న మాట. అందుకే.. ఈ ఆదాయం మరికొంత పెంచుకునే ప్రయత్నం చేస్తే.. రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవచ్చన్నది బాబు సర్కార్ ఆలోచన. కేబినెట్ మీటింగ్ లోనూ ఈ అంశానికి గ్రీన్ సిగ్నల్ పడింది. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. రుణమాఫీ సొమ్మును మందుబాబులు కట్టబోతున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: