చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు అందుకోబోతున్న ఆయన కొడుకు లోకేశ్.. కార్యకర్తల సంక్షేమం కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నాడు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఆయన క్రమంగా ఈ పోస్టు ద్వారా పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పార్టీ అధికారంలోకి వచ్చినా.. అధికారంపై పెద్దగా దృష్టిపెట్టకుండా.. పార్టీపైనే పూర్తి సమయం వెచ్చిస్తున్నాడు. వై.ఎస్. హాయంలో జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నట్టు .. తనకూ బ్యాడ్ నేమ్ రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఈమధ్య కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను కూడా ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తాజాగా ఆయన చేస్తున్న ఒక ఆలోచన వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదేంటంటే.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను గుర్తించి వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి.. వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలన్నది లోకేశ్ తాజా ఆలోచన. వాస్తవానికి ఇది చాలా మంచి ఆలోచన. చాలా పార్టీలు ఎన్నికల సమయంలో కార్యకర్తలను వాడుకుంటాయి తప్పించి.. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవు. ఎన్నికల తర్వాత ఏదైనా పని కోసం నాయకులను కలిసినా వాళ్లూ పదిసార్లు తిప్పించుకుంటారే గానీ అంతగా సాయం చేయరు. కానీ లోకేశ్ .. వారి కోసం చాలా ఆలోచిస్తున్నాడు. ఇందులో తిరకాసేమిటంటే.. ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల ద్వారా అమలయ్యేలా చూసే ఆలోచన ఉందట. నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా కాకపోయినా.. ప్రభుత్వ పథకాల్లో వారికి లబ్ది చేకూర్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కార్యకర్తల మంచి కోసం ఇలా చేయడం పార్టీ నాయకుడిగా కరెక్టేమో కానీ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యమిచ్చేలా ఈ కార్యక్రమాలు రూపొందితే.. అది చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ తమ కార్యకర్తల కోసం పక్షపాత వైఖరి చూపించడం సాధారణమే కానీ.. నేరు గా ప్రభుత్వ కార్యక్రమాల్లో ... ప్రభుత్వ పథకాల్లో వారికి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తే.. విమర్శలు ఎదుర్కోక తప్పదు. అలా కాకుండా కార్యకర్తలకు శిక్షణ పూర్తిగా పార్టీ వ్యవహారంగా జరిగితే మాత్రం లోకేశ్ ఆలోచనను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: