తెలంగాణ ప్రభుత్వం టెన్నీస్ స్టార్ సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సానియా మీర్జా అతర్జాతీయ వేదికపై ఘోరంగా విఫలమైన తరుణంలో ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ను చేస్తుందని క్రీడారంగానికి చెందిన సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సానియా భారతదేశంలో బాగా రాణించిందని, అయితే ఆమె వస్త్రధారణ కూడా ఆమెకు ఖ్యాతిని తెచ్చిపెట్టిందని వీరు ఎద్దేవా చేసారు. ఇక అందం, టాలెంట్ కలగలిసి ఉన్నందున కార్పోరేట్ కంపెనీలు సానియా కోసం క్యూలు కట్టాయని వీరు విమర్శించారు. అయితే అంతమాత్రాన సానియా ఏమీ సాధించలేదని, భారతదేశంలో తప్ప ఏ ఇతర విదేశీ గడ్డపై ఆమె ఫైనల్స్ దాకా కూడా చేరుకోలేదని వీరు దుయ్యబట్టారు. పాకిస్థానీ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ కు పెళ్లి చేసుకుని ఇప్పుడు తిరిగి భారత్ లో గుర్తింపు పొందడానికి ఆమె శతవిధాల ప్రయత్నిస్తోందని క్రీడా ప్రముఖులు వివరించారు. కాగా సింగిల్స్ ఇక ఆడి విజయం సాధించలేనని తెలుసుకుని డబుల్స్ పై సానియా దృష్టి సారించిందని వారు తెలిపారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోటి రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వడానికి వేరే ఏ యువ క్రీడాకారులు దొరకలేదా అని రాష్ట్రంలో క్రీడా ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ ఈ విధంగా చేసారని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్ లో మైనారిటీల ఓట్లు కొల్లగొట్టడానికే సానియా మీర్జాకు పెద్దపీట వేసారని వీరు గగ్గోలు పెడుతున్నారు. మరి కెసిఆర్ ఏ ఉద్దేశంతో చేసినా సానియా మాత్రం మంచి ఛాన్స్ నే కొట్టేసింది అనడం అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: