సమైక్య రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలుగా విడిపోయిన తర్వాత.. జల వివాదాల అంశం కీలకంగా మారింది. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టుకే.. నీళ్లు, ఉద్యోగాలు.. అనే పునాదులపై ఏర్పడిన నేపథ్యంలో .. విభజన తర్వాత రెండు రాష్టాల మధ్య జలవివాదాలు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఉత్కంఠ రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు పది టీఎంసీల నీరు విడుదల అంశం వివాదంగా మారింది. మరోవైపు కర్ణాటక, ఆంధ్ర రైతుల మధ్య రాజోలి బండ వివాదం నడుస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరిగే ట్రిబ్యునల్ సమావేశానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధికారులూ హాజరుకానున్నారు. ప్రస్తుత ట్రిబ్యునల్‌ను రద్దు చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు కృష్ణా నది మొత్తాన్నిఒకే బోర్డు కిందకు తేవాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉంది. దీనివల్ల నిర్వహణలో ఇబ్బందులు వస్తాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కృష్ణానదిపై ఇప్పటి వరకూ గొడవలన్నీ కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్యే వివాదాలు నడిచాయి. అందులోనూ ఎక్కువగా ఆల్మట్టిపైనే. సమస్య ఏళ్లుగడుస్తున్నా ఆల్మట్టి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కృష్ణానదిపై హక్కులు విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల చేతుల్లో నుంచి బోర్డు ఆధీనంలోకి వెళ్లిపోయాయి. తాజాగా ట్రిబ్యునల్ సైతం రంగంలోకి దిగటం, నాలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించాలని నిర్ణయించటంతో హక్కులపై భవిష్యత్తు పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణాజలాల పంపకాలను పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర జలవనరుల మంత్రికి వినతిపత్రం అందించిన తెలంగాణ సర్కార్ అదే విషయాన్ని ట్రైబ్యునల్‌లో ప్రస్తావించే సూచనలున్నాయి. ఐతే దీనికి అంగీకరించేదిలేదని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్తోంది. ఈ నేపథ్యంలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, సీమాంధ్ర తమతమ వాదనలతో సిద్ధమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: