కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ 2004లో స్పష్టమైన మెజారిటీ దక్కించుకున్నా.. ఆమె ప్రధాని పీఠం అధిష్టించకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్‌సింగ్ బయటపెట్టారు. సోనియాగాంధీ ప్రధాని కాకపోవడానికి ఆమె కుమారుడు ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీయే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి రాజీవ్‌గాంధీలా తల్లి సోనియాను కూడా చంపేస్తారేమోనని అడ్డుపడ్డారని తెలిపారు. 24గంటల్లోగా ప్రధాని పదవిని తిరస్కరిస్తున్నట్లు చెప్పాలని సోనియాకు డెడ్‌లైన్ విధించారని చెప్పారు. ఈ విషయంలో ఓ కుమారుడిగా రాహుల్ తీసుకున్న నిర్ణయానికి తాను వందశాతం సమర్థిస్తానని నట్వర్ పేర్కొన్నారు. బుధవారం హెడ్‌లైన్స్ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సోనియాను రాహుల్ వారించినప్పుడు ప్రియాంకగాంధీ కాంగ్రెస్ నేతలు సుమన్ దూబే, మన్మోహన్‌సింగ్ కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ వచ్చే నెలలో విడుదల అవుతున్న తన పుస్తకం వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్‌లో పొందుపర్చినట్లు చెప్పారు. గత మే 7న సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకగాంధీనుంచి కబురు రావడంతో వెళ్లి కలిశాను. ఈ సందర్భంగా వారు నా పుస్తకంలోని కొన్ని విషయాలు తొలగించాల్సిందిగా కోరారు. అదేవిధంగా నాతో వ్యవహరించిన తీరుపై కూడా క్షమాపణలు చెప్పారు అని వెల్లడించారు.  అయితే, సోనియాగాంధీ ప్రచురితం కాకూడదని కోరుకున్న కొన్ని అంశాలు తన పుస్తకంలో ఉన్నాయని నట్వర్‌సింగ్ తెలిపారు. ఈ విషయాలన్నీ రహస్యంగా ఉంచకుండా ఎందుకు బయటపెడుతున్నారని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. సోనియాగాంధీ ఓ చారిత్రాత్మక నేత. అలాంటినేతలకు రహస్యాలు అంటూ ఏమీ ఉండవు అని పేర్కొన్నారు. 1991లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ ప్రధాని కావాలని సోనియాగాంధీ భావించారు. ఆరోగ్యకారణాలరిత్యా ఆయన తిరస్కరించారు. దీంతో సోనియాగాంధీ రెండో ఎంపిక అయిన పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు అని నట్వర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: