తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను వ్యక్తిగతంగా కించపరుస్తూ శ్రీలంక రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన ఓ వ్యాసంపై తమిళనాడులో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. ఈ వ్యాసానికి అనుబంధంగా ప్రధాని నరేంద్ర మోడీ రేఖాచిత్రాలను కూడా జతపర్చారు. పైగా ఆర్టికల్‌కు 'మోడీకి జయలలిత ప్రేమలేఖల సంగతేమిటీ' అనే శీర్షికను కూడా తగిలించారు. వెబ్‌సైట్‌లో వ్యాసం గురించి వెలుగులోకి వచ్చిన కొద్ది గంటలలోనే తమిళనాడులో అన్ని పార్టీల నేతలు దీనిని ఖండించారు. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో ఆ తరువాత శ్రీలంక ప్రభుత్వం జరిగిన దానికి క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటించింది. శ్రీలంక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వెలువడ్డ వ్యాసంపై తమిళపార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యమంత్రి జయలలితకు సంఘీభావం వ్యక్తం చేశాయి. అన్నాడిఎంకె, తమిళ సంస్థలు పలు చోట్ల నిరసన ప్రదర్శనలకు దిగాయి. ఎన్డీఏ మిత్రపక్షాల వారు ఈ వ్యాసంపై నిరసన వ్యక్తం చేస్తూ, భారత ప్రభుత్వం వెంటనే శ్రీలంకతో దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తిగా జయలలితపై వ్యంగ్యాత్మక విమర్శలు గుప్పిస్తూ, అనుబంధంగా నేపథ్యంలో మోడీ రేఖాచిత్రాలను పెట్టడం, మోడీకి జయ ఎందుకు లేఖలు రాశారు? వాటిలో ఎంతమేరకు ఔచిత్యం ఉందని ప్రశ్నించారు. ఇలాంటి అమర్యాదకర వ్యాసాన్ని శ్రీలంక అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టడం దారుణమని తమిళనాడు బిజెపి శాఖ విమర్శించింది. తమిళనాడులో వివిధ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ ఈ అంశంపై తక్షణమే అన్ని పార్టీలూ ఏకమయ్యాయి. ఇతర పార్టీలు లంకతో దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ తాము ఇంత తీవ్రస్థాయి చర్యలు అవసరం లేదని భావిస్తున్నామని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి వనతి శ్రీనివాసన్‌ చెప్పారు. ఆర్టికల్‌ ఉదంతంపై డిఎంకె కూడా నిరసన వ్యక్తం చేసింది. శ్రీలంకతో ముడివడి ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తెస్తూ, ప్రధానికి లేఖలు రాయడాన్ని మరోవిధంగా చిత్రీకరించడం, వాటిని ప్రేమలేఖలుగా పేర్కొనడం, కించపర్చే విధంగా అసభ్య పదజాలం వాడటం, ఇవన్నీ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం ఎంతవరకు ఔచిత్యం అన్పించుకు ంటుందని డిఎంకె ప్రతినిధి విమర్శించారు. ఈ ఆర్టికల్‌ కేవలం జయలలితనే కాకుండా, మోడీని కూడా అప్రతిష్ట పాలు చేసే విధం గా ఉందని పిఎంకె వ్యవస్థాపకుడు ఎస్‌ రామదాస్‌ ఆక్షేపించారు. లంక ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రిపైనా, ప్రధానిపైనా చేసిన చవకబారు వ్యాఖ్యా నాలతో ఆ దేశం అధికారికంగానే భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నట్లు అయిందని విమర్శించారు. అయితే బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో ఓ బృందం ఇటీవల లంకలో పర్యటించిందని, స్వామి ప్రోద్బలం తోనే వెబ్‌సైట్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దిగారని తెలిపారు. ప్రజల నుంచి అత్యంత ఆదరణ పొందిన జయలలిత, అందులోనూ ఓ మహిళను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం దారుణమని విమర్శించారు. ప్రత్యేకించి తమిళ జాలర్ల అంశంలో శ్రీలంక నావిక దళాల చర్యలకు ఆక్షేపణ తెలియచేస్తూ పలుమార్లు జయలలిత ప్రధానికి లేఖలు రాశారు. క్షమాపణ చెప్పిన లంక ప్రభుత్వం : వెబ్‌సైట్‌లో వచ్చిన ఆర్టికల్‌పై వివాదం చెలరేగడంతో శ్రీలంక ప్రభుత్వం వెంటనే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. జరిగినదానికి బేషరతుగా క్షమాపణ చెపుతున్నట్లు ప్రధాని మోడీకి, జయలలితకు తెలిపింది. సరైన పరిశీలన లేకుండా, అనుమతి లేకుండానే ఈ ఆర్టికల్‌ ప్రచురితం అయిందని, తెలిసిన వెంటనే వెబ్‌సైట్‌ నుంచి దీనిని తొలగించామని శ్రీలంక రక్షణ మంత్రి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: