బడ్జెట్ అంటే ఏంటి.. ఏడాదిలో రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. దాన్ని ఎలా ఖర్చు చేస్తారు.. అనే విషయాలు పొందుపరిచే పత్రం. ఐతే ఇది పేరుకే. వాస్తవానికి బడ్జెట్ లో చెప్పింది చెప్పినట్టు జరగనే జరగదు. చాలా నిధులు కేటాయించిన పథకాలకు కాకుండా ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు తరలిపోతాయ్.. మరికొన్ని మురిగిపోతాయ్.. అందుకే బడ్జెట్ ను విపక్షాలు ఎప్పుడూ అంకెల గారడీ అని విమర్శించడం చూస్తుంటాం. మొదటిసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న కేసీఆర్ మాత్రం బడ్జెట్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారట. అంకెల గారడీలా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త తరహాలో బడ్జెట్ తయారు చేయాలని కేసీఆర్ తన టీమ్ ను ఆదేశించారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రాధాన్యతా రంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని సూచించారు. అంతే కాదు.. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించారు. మూస ధోరణిలో వెళ్లవద్దని.. వినూత్నంగా బడ్జెట్ ఉండాలని కేసీఆర్ పదే పదే.. ఆర్థిక మంత్రి రాజేందర్ కు, సంబంధిత అధికారులకు చెప్పారట. అవసరాలు, ప్రాధాన్యతలను ఖచ్చితంగా గుర్తించి కేటాయింపులు జరిపించాలని చెప్పారట కేసీఆర్. ఓవైపు భారీగా ఎన్నికల హామీలు.. వాటితో పాటు మంత్రివర్గం ఆమోదించిన సంక్షేమ పథకాలు.. వీటన్నింటికీ నిధులు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక కొత్త మంత్రి ఈటెల రాజేందర్.. జుట్టుపీక్కుంటున్నారట. కేసీఆర్ ప్రయారిటీ లిస్టులో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ, హరితహారం ఉన్నాయట. అవసరమైతే ఇంకో మూడు, నాలుగు సార్లు కూర్చుందాం.. కానీ లెక్క మాత్రం పక్కాగుండాలని కేసీఆర్ కోరుతున్నారు. సంబంధింత మంత్రి, అధికారుల వరకే బడ్జెట్ కసరత్తు పరిమితం కాకుండా... ప్రభుత్వ సలహాదార్లను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: