బిజెపి వారు తనను కొనబొయ్యారని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రముఖ నాయకుడు కుమార్‌ విశ్వాస్‌ సంచలన్మాతక ప్రకటన చేశారు. ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు తనతో కమలనాథులు బేరాలకు దిగారని, తమతో కలిసివస్తే సిఎం పదవి ఇస్తామని ఆశచూపారని విశ్వాస్‌ శనివారం ఆరోపించారు. ఆప్‌ సిఎం రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పార్టీ ఫిరాయింపులకు బిజెపి ఇటీవలి కాలంలో బేరాలకు దిగిందని, బిజెపిలో చేరితే ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని తెలిపారని, తమకు ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉండేలా సహకరించాలని వారు కోరారని విశ్వాస్‌ తెలిపారు. ఈ నెల 19న బిజెపి ఎంపీ ఒకరు తన వద్దకు వచ్చారని, ఆయన తనకు మంచి స్నేహితుడని, వెంట కొందరు బిజెపి నేతలు కూడా ఉన్నారని, 'సిఎం పదవి ఇస్తాం. మాతో వస్తావా!' అని వారు బేరానికి దిగారని విశ్వాస్‌ ప్రకటించడంతో దేశ రాజధానిలో అధికార పీఠం కైవసానికి బిజెపి సాగిస్తోన్న తెరవెనుక ప్రయత్నాల గురించి స్పష్టం అయింది. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని, బిజెపి ఉన్నత స్థాయి వారి నుంచి అనుమతి తీసుకునే ఈ ప్రతిపాదన చేస్తున్నామని, పదవి కావాలంటే, ఆప్‌ వదిలి బిజెపిలోకి రావాలని వారు షరతులు పెట్టారని చెప్పిన విశ్వాస్‌ ఇంతకూ ఆ బిజెపి ఎంపీ ఎవరనేది వెల్లడించలేదు. తాము చెప్పినదానికి అంగీకరిస్తే వెంటనే బడా బిజెపి నేతలను కలిపిస్తామని, అక్కడ మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చునని, ముందుగా బిజెపిలో చేరితే అన్నింటికీ మంచిదని తెలిపారని విశ్వాస్‌ చెప్పారు. ఆప్‌ నేత విశ్వాస్‌ కవి కూడా. తాను ఈ విషయాన్ని పెద్దగా గోలచేయదల్చుకోలేదని, తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించాను కాబట్టి దీనిపై రాద్ధాంతానికి దిగదల్చుకోలేదన్నారు. ఢిల్లీలో ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి లోగుట్టు ప్రయత్నాలు చేస్తోందని, దీనిని ప్రజల దృష్టికి తీము తీసుకువస్తూనే ఉన్నామని ఆప్‌ నేత తెలిపారు. బిజెపి వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తాము లొంగలేదని వివరించారు. తాము కేవలం ఉత్తుత్తి ఆరోపణలు చేసేవాళ్లం కాదని, ఏది చెప్పినా ఫక్కా ఆధారాలతో ముందుకు వస్తామని విశ్వాస్‌ వెల్లడించారు. బిజెపి సంగతేమిటో ప్రజలకు ఇక తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు. విశ్వాస్‌ ప్రకటనపై ఆప్‌ అధికారికంగా స్పందించింది. ఆయన తగురీతిలో ప్రజలకు విషయం తెలియచేశారని, వెంటనే ఎన్నికలు జరిపిం చాలని తమ పార్టీ కోరుతోందని, అంతేకానీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దిగరాదని , అధికారం కోసం అడ్డదారులు తొక్కరాదని తాము బిజెపికి విజ్ఞప్తి చేస్తున్నామని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. చాలాకాలంగా ఆప్‌ ఎమ్మెల్యే లకు బిజెపి గాలం వేస్తున్న విషయం వెలు గులోకి వస్తూనే ఉంది. కేంద్రంలో అధికారం దక్కించుకున్న తరువాత బిజెపి వర్గాలు ఢిల్లీలో వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా, దొడ్డిదారిన అధికారం చేజిక్కుంచుకునేందుకు సర్వవిధాలుగా యత్నిస్తున్నారని ఆప్‌ ఎమ్మెల్యేలు పలుమార్లు ఆరోపిస్తూ వచ్చారు. బిజెపిని అధికారం చేపట్టేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆహ్వానించవచ్చునని వార్తలు వెలువడుతున్న తరుణంలోనే ఆప్‌ సీనియర్‌ నాయకుడు విశ్వాస్‌ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీ యాలలో చర్చకు దారితీస్తోంది. బిజెపికి ఇతర పార్టీల కన్నా ఎక్కువగా బలం ఉన్నప్పటికీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే బలం లేకపోవడంతో ఇతర పార్టీల వైపు ఆ పార్టీ కన్నేసింది. అకాలీదళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిపితే అసెంబ్లీలో 32 సీట్లు వచ్చాయి. 70 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులుగా వెళ్లడంతో ఆ పార్టీ బలం 28కి తగ్గింది. జనలోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించి పట్టుబట్టిన తరువాత ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆప్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అక్కడ అసెంబ్లీ సుషుప్తావస్థలోకి వెళ్లింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: