ఉత్తర భారతం తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బొగ్గు కొరతే ఇందుకు ప్రధాన కారణం. బొగ్గు నిల్వలు లేక ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో నడిచే మూడు విద్యుత్‌ ప్లాంట్‌లు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మూడు ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. బొగ్గు నిల్వలు పూర్తిగా హరించుకుపోవడంతో ఉత్తర ప్రాంతంలో ప్రస్తుతం 5 వేల మెగావాట్ల విద్యుత్‌ కొరత ఏర్పడింది. దేశంలో అతి పెద్ద విద్యుత్‌ ఉత్పత్తిదారు అయిన ఎన్‌టిపిసి విద్యుత్‌ స్టేషన్లు చత్తీస్‌ఘర్‌లోని సిపత్‌, హర్యానాలోని బదర్‌పూర్‌, ఝజ్జార్‌లలో మూడు రోజులుగా ఇంధన నిల్వలు లేవని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఎ) తెలియజేసింది. ఝజ్జార్‌ ప్లాంట్‌ను ఎన్‌టిపిసి, ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలు సంయుక్తంగా నడుపుతున్నాయి. గత 10 రోజులుగా ఈ ప్లాంట్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో దీని సామర్థ్యం 1500 మెగావాట్లలో మూడింట ఒకవంతు పడిపోనుంది. ఈ ప్లాంట్‌కు మహానది, ఉత్తర బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు అందుతుంది.  ఈ ప్లాంట్‌ నుండి వచ్చే విద్యుత్‌ హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. ఈ ప్లాంట్‌ ఇప్పుడు బొగ్గు కొరతతో మూతపడే అవకాశాలు కనిపిస్తుండడంతో దీనినుండి విద్యుత్‌ను అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రంపైనా ప్రభావం పడే సూచనలు ఉన్నాయి. ఎన్‌టిపిసి ఆధ్వర్యంలోని 705 మెగావాట్ల బదర్‌పూర్‌ స్టేషన్‌ కూడా తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. బొగ్గు నిల్వలు అందకపోతే తక్కువ సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే అధికారులకు తెలియజేశారు. ఇప్పటికే ఒక యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసిన 2,980 మెగావాట్ల సిపత్‌ ప్లాంట్‌లో మిగిలిన యూనిట్లు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి నిలుపుదలను నివారిం చేందుకు బొగ్గు సరఫరాలో ఈ విద్యుత్‌ స్టేషన్‌లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. సిఇఎ సమాచారం ప్రకారం దేశంలోని 100 ధర్మల్‌ విద్యుత్‌ స్టేషన్లలో దాదాపుగా నాలుగింట ఒక వంతు స్టేషన్‌లో ఇంధన నిల్వలు కరువయ్యాయి. మొత్తం 27 ప్లాంట్లు ఉండగా ఆరు ప్లాంట్లలో గురువారం నుండి ఇంధన నిల్వలు లేకుండాపోయాయి.  ఇందులో మూడు ప్లాంట్‌లలో వారం రోజులుగా సరైన నిల్వలు లేవు. ఉత్తర ప్రాంత లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌డిసి) నివేదిక ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాల్లో శుక్రవారం నుండి భారీగా 5,323 మెగావాట్ల మేర విద్యుత్‌ కొరత ఏర్పడింది. ఈ ప్రాంతంలో విద్యుత్‌ సామర్థ్యం 50,610 మెగావాట్లకు పెరగాల్సిన అవసరం ఉంది. ఇందులో 45,287 మెగావాట్లు సరఫరా చేయాలి అని ఉత్తర ప్రాంత విద్యుత్‌ వ్యవస్థ సమగ్ర నిర్వహణ చూసే అత్యున్నత సంస్థ ఎన్‌ఆర్‌ఎల్‌డిసి తన తాజా నివేదికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: