రాజధాని ప్రకటనతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా ఉపందుకున్నాయి. వారానికి, నెలకు రేట్లు మారిపోతున్నాయి.. దీనికి తోడు చంద్రబాబు సర్కారు ఆ సిటీ.. ఈ సిటీ.. మెట్రో.. మోడల్.. అంటూ రోజుకో ప్రకటన చేయడం రియల్టర్లు పండుగ చేసుకుంటున్నారు. జనానికి మాయమాటలు చెప్పి.. రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. కొనేవారు కూడా ఎంత రేటు పెరిగినా.. ముందు ముందు అంతకంటే పెరుగుతాయన్న ధీమాతో ధైర్యం చేసి కొంటున్నారు. ఈ సమయంలో ఆచితూచి ఆలోచించే మదుపర్లు ఆలోచనలో పడుతున్నారు.. భూమిలో పెట్టుబడి పెట్టాలంటే ఇది సరైన సమయమేనా.. ఈ రియల్ భూం ఎంతకాలం ఉంటుంది.. హైదరాబాద్ లో 2004 ప్రాంతంలో వచ్చిన భూం.. ఆ తర్వాత ఢాం అన్నట్టు విజయవాడలోనూ జరుగుతుందా.. అని లెక్కలు వేసుకోవడంలో మునిగిపోయారు. అలాంటి వాళ్ల అనుమానాలు నిజం చేసేలా.. విజయవాడ రియల్ భూం ఢామ్మనక తప్పదని ఓ పెద్దాయన కుండబద్దలు కొట్టి చెప్పారు. పెద్దాయన అంటే ఆషామాషీ పెద్దాయన కాదు. ఆయనెవరో కాదు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో వెంకయ్య ఈ మాట చెప్పారు. ఇప్పటికే విజయవాడ భూముల ధరలు న్యూయార్క్ సిటీతో పోటీ పడుతున్నాయని.. ఆ రేట్లు నిలబడవని తేల్చి చెప్పారు. జాగ్రత్తపరులెవరూ విజయవాడ పరిసర ప్రాంతాల్ల్లో భూములు కొనవద్దని సూచించారు. రేట్లు ఒక్కసారి తగ్గడం మొదలైతే.. పతనం భారీ గా ఉంటుందని వెంకయ్య చెబుతున్నారు. అంతేకాదు.. తన రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని.. తాను అబద్దాలు చెప్పనని కూడా సెలవిచ్చారు. అందుకే విజయవాడ వైపు పరుగులు తీసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: