ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కమలనాధులను ఇంటాబయటా విమర్శలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి వరకూ శివసేనతో సీట్ల ఒప్పందంపై ఢీ అంటే ఢీ అన్న అమిత్‌షా వెనక్కు తగ్గారు. పోటీచేయాలనుకున్న నియోజకవర్గాలు తగ్గించుకోవడానికి సిద్దమయ్యారు. ఊహాలోకాల్లో తేలియాడుతున్న నరేంద్రమోడీ వర్గం.. ఉప ఎన్నికల ఫలితాలతో నేలకు దిగొచ్చింది. అడుగులు భూమిమీదే ఉండాలన్న మిత్రుడు శివసేన మాటలు చెవికెక్కినట్టున్నాయి. ఇంటా బయటా విమర్శలతో నేలకు దిగొచ్చిన అమిత్‌షా మరాఠా గడ్డపై జరుగుతున్నమిత్రుల మధ్య గలాటాను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న సంకేతాలు పంపారు. సగం సీట్ల ఫార్మూలా వదులుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నారు. అక్టోబర్‌ 15న మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో బీజేపీ- శివసేన సీట్ల సర్ధుబాటు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. మరికొన్ని పార్టీలతో కలిసి గ్రాండ్‌ అలయెన్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 ఇతర మిత్రులకిచ్చి బీజేపీ-శివసేన చెరో 135 స్థానాల్లో పోటీ చేయాలని కమలనాధులు కొత్త ఫార్ములా తెరమీదకు తెచ్చారు. అప్పటికే సిఎం పోస్టుపై కన్నేసిన శివసేన అధినేత.. బీజేపీ ఫార్ములాపై తమ అధికారిక పత్రికలో తీవ్రంగా విరుచుకపడ్డారు. కమలనాధులకు కళ్లు నెత్తికెక్కాయని.. నెల మీద ఉంటే మంచిదని హెచ్చరించారు. 150 సీట్లకు తక్కువ స్థానాల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ కూడా వెనక్కు తగ్గలేదు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఉప ఎన్నికల ఫలితాలతో వెనక్కు తగ్గిన బీజేపీ శివసేనతో సీట్ల ఒప్పందానికి సిద్దమైంది. శివసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.  భవిష్యత్తులో పొత్తులు లేకపోతే ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ సీట్లు తగ్గించుకోవడానికి సిద్దమైంది. ఒంటరిగా పోటీ చేసి ఏమాత్రం అంచనాలు అందుకోకపోయినా అది మోడీ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంతవరకూ ప్రచారం చేసిన మోడీత్వం పనిచేయలేదన్న వాదనలు బలపడతాయి. నియంతృత్వ పోకడలతో దశాబ్ధాలుగా ఉన్న సైద్దాంతిక మిత్రత్వం వదులుకుంటే భవిష్యత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమిత్‌షా శివసేన దారికి వచ్చినట్టు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: