తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న ప్రచ్ఛన్నయుద్ధాన్ని చల్లార్చేందుకు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. రెండుకళ్ళ సిద్ధాంతం, సమైక్య నినాదంతో కోలుకోలేని విధంగా తెలంగాణ జిల్లాలో టిడిపి దెబ్బతినడం, ఆపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్‌ఎస్‌ గూటికి చేరడం తీవ్ర కలవరానికి గురిచేయడం, పార్టీలో అంతర్గత యుద్ధం చోటుచేసుకోవడంతో చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో మంగళవారం భేటీ అయ్యారు. టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో టిటిడిపి శాసనసభాపక్షం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు రహస్యంగా భేటీ అయి మంతనాలు సాగిస్తున్నారన్న వార్త గుప్పుమనగానే చంద్రబాబు నాయుడు మంగళవారం తెలంగాణ తెలుగుదేశం నాయకులతో సమావేశమైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీకి ఎర్రబెల్లి దయాకరరావు, టిటిడిపి పక్షం ఉపనాయకులు ఎ.రేవంత్‌రెడ్డి, ధర్మారెడ్డి, ఎల్‌.రమణలు హాజరయ్యారు. టిటిడిపి నేతల అభిప్రాయాలను, ఆలోచనలను, పార్టీ పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పార్టీని వీడివెళ్ళకూడదని అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసానిచ్చినట్లు తెలుస్తోంది. తొలి నుంచి టిడిపిలో ఉండటంతో పాటు, అన్ని విషయాల్లో ముఖ్యపాత్ర పోషించిన ఎర్రబెల్లి దయాకరరావుకు పార్టీని వీడకూడదని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మీ నాయకత్వం అవసరం, పార్టీ బలోపేతానికి మీరు కీలకమని ఎర్రబెల్లి ముందే స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. నన్నుపక్కన పెట్టేందుకు, ఎ.రేవంత్‌రెడ్డిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారా? అని ఎర్రబెల్లి చంద్రబాబు ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు ఎర్రబెల్లికి భరోసానివ్వటంతో తాత్కాలికంగా మొత్తబడినట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. అయితే, ఎట్టిపరిస్థితుల్లో ఎర్రబెల్లి పార్టీలో ఉండరని, కారెక్కడం ఖాయామని మరో ప్రచారం జరుగుతోంది. టిటిడిపిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని కార్యకర్తల్లో కలవరం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: